కాలమవడమంటే

  • 867 Views
  • 11Likes

    జి.రామకృష్ణ

  • భూదాన్‌ పోచంపల్లి, నల్గొండ
  • 8977412795

నల్లమబ్బు గుడారంలో సూర్యుడు తలదాచుకుంటే
వానకాలమవుతుందా?
ఆకాశం వానపందిరిలా, వాన చినుకులు
మెరుపు దారాలుగా వేలాడినంత మాత్రాన
వాన కాలమైనట్లేనా?
మట్టితోటలో వానపాములు పూయించని వాన వానెలా అవుతుంది?
కాలమవడమంటే
దారులన్నీ నీళ్లదుప్పటిలో పొర్లాడి 
పచ్చిగా పరవశించాలి,
కుంట చెరువవ్వాలి, చెరువు నదీ ప్రాణకిరీటం ధరించాలి.
అలుగు దునికిన చెరువు పిల్లల్లా 
కాలువ పాదాల చేలల్లోకి మళ్లాలి.
రైతు దుఃఖం ముక్కలు ముక్కలయ్యేలా
మన్నులో దాచిన విత్తు అంతరంగం గొంతెత్తి పచ్చని రాగం ఆలపించాలి.
వానంటే,
వాకిట్లో నీళ్ల కళ్లాపి చల్లాలి
చిట్టి చిట్టి నీటికుప్పల ముగ్గులేయాలి
పులిచర్మం అతికించినట్టుండే గడపదేహంపై
చినుకు పెదవుల ఎంగిలి ముద్దులు రాలాలి.
వానకాలమంటే
ఊరు ముత్తయిదువులా నుదుటిపై నీటి కుంకుమ దిద్దాలి.
అప్పుడెప్పుడో
ఊరు మీద కరవు బకాసురుడు పడ్డాడని
చస్తే ఊరుముఖం చూడొద్దని దూరతీరాలకు
వలస నావనెక్కిన బతుకు సుడిగుండానివి
దారం తెగిన గాలిపటం ఎగిరొచ్చినట్టు
ఎప్పటిదో తూనీగ భుజంపై వాలినట్టు
నువ్వొస్తేనే కదా
కాలమైనట్లు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి


రేయి

రేయి

వాసుదేవమూర్తి శ్రీపతి