శ్రీకృష్ణ జననం

  • 1171 Views
  • 0Likes

    కౌండిన్య

  • రాజమండ్రి

కంసుణ్ని ఆకాశవాణి హెచ్చరించడం...
కలికి దేవకిదేవి కలహంస నడకల
    నవవధూ రత్నమై నడచిరాగ
వసుదేవ భూపతి ప్రభవిల్లు దీప్తుల
    కల్యాణ వరునిగా కదలిరాగ
కల్యాణ మొనరించి కడు వైభవమ్ముగ
    కడుమోద మొందుచు కంసరాజు
నవ వధూవరులతో నగర వీధులయందు
    ఊరేగ మదినెంచి ఉత్సవముగ
అనుగు చెల్లిని బావను అతిశయముగ
రంగు రంగారు బంగారు రథమునందు
ప్రేమ నాసీనులుగ జేసి ప్రియముఁగూర్చి
తానె సారథ్య మొనరించి తరలుచుండ.    1
శ్రీపరంధాముడే శ్రీకృష్ణుడై పుట్టి
    వసుధగాచెడి భావి వాణియనగ
వసుదేవ దేవకీ వరుల భవిష్యమ్ము
    కల్లోలమౌ కాలఘంటి యనగ
సతతమ్ము పరమేశు సంకీర్తనముఁ జేయు
    భక్తాళులకు భద్రవాక్యమనగ
ధర్మభంగముఁ జేయు దనుజ సంఘములకు
    పాపిష్ఠుల కశనిపాతమనగ
అగ్ని శిఖర కీల లాహవమ్ముగ పొంగి
కంసరాజు గుండె కనలి చెదర
అవని దిగులుతీరి ఆనందముప్పొంగ
గగనవాణి పల్కె ఖంగుమనుచు      2
ముద్దు చెల్లిఁ జూచి మురియుచుంటివిగాని
ముప్పుగల్గు నీకు ముందుముందు
హరి జనించు నామె యష్టమ గర్భాన
ఉక్కడంచి నీదు ఉసురుఁ దీయు     3
      ఇలా ఆకాశవాణి హెచ్చరించడంతో కంసుడు ఉన్నపళంగా చెల్లి దేవకీదేవిని చంపబోయాడు. ఇంతలో వసుదేవుడు అడ్డం వచ్చాడు. దాంతో కంసుడు వాళ్లిద్దరిని చెరసాలలో బంధించాడు.  అక్కడ వాళ్లకు ఆరుగురు కుమారులు జన్మించారు. వసుదేవుడి విన్నపం మేరకు కంసుడు ఆ పసికందులను చంపకుండా విడిచిపెడతాడు. అంతేకాదు, ఆ పిల్లలతో ఆడి మురిసిపోతాడు.
మాకు పుట్టఁబోవు మగబిడ్డలందున
అష్టముండె నీకు అడ్డుగాన
తొల్తపుట్టు వారి దోషమ్ము లేకున్న
దయను వారిఁగావ తలపవేని        4
పుట్టువారినెల్ల పొత్తిళ్లతో తెచ్చి
అప్పగింతునయ్య! అమ్మతోడు!
చంపివైతువేని చంపకుండుదువేని
సర్వమదియు నీదు చలువ సుమ్ము!    5
నారీరత్నము దేవకీరమణి పుణ్యాయత్త 
భాగ్యంబునన్‌
ధీరుండౌ వసుదేవు యాదవు మహత్తేజస్వు 
పెండ్లాడినన్‌
వారా కంసునిచేతఁ జిక్కి యిడుముల్‌
 పాయంగ నవ్వారికిన్‌
కారాగారము పుట్టినిల్లు గదరా! గార్హస్థ్య 
ధర్మంబునన్‌ 6
బోసినవ్వులు రువ్వు బుజ్జి పాపడొకండు
    ప్రాకివచ్చి పదము పట్టునొకడు
వెవ్వె! వెవ్వె! యనుచు వెక్కిరించునొకడు
    ఎత్తుకొను మటంచు యేడ్చునొకడు
పరుగెత్తుకొని వచ్చి పడదోయు నొక్కండు
    ఆటాడ రమ్మంచు అరచునొకడు
చిందులిట్టుల వేయు చిన్ని మేనల్లుళ్లు
    తన్నుజూచి మురియ తనివిఁ దీర 
కఠిన హృదయుడైన కంసరాజేంద్రుడు
పగను మరచి మిగుల పరవశముగ
వేళయెంచకుండ పిల్లవారలఁగూడి
ముద్దులాడి తాను మురియుచుండె.     7
      అలా రోజులు గడుస్తుండగా, ఒకనాడు నారదుడు వచ్చాడు. ఆయన మాటలు విని రెచ్చిపోయిన కంసుడు ఆ ఆరుగురు పిల్లల్ని వధించాడు. తర్వాత దేవకీదేవి సప్తమ గర్భం సంకర్షణమై యోగమాయ వల్ల, వ్రేపల్లెలో రోహిణి గర్భాన బలరాముడు జన్మించాడు. వ్రేపల్లెలోనే యోగమాయ యశోదకు కుమార్తెగా పుట్టింది. ఆ తర్వాత చెరసాలలో దేవకీదేవికి అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడు జన్మించాడు.
పసిబాలుడైన పరమాత్ముడు
బాలభానునిఁ బోలు ఫాలభాగమునందు
    కస్తూరి నామ సంకలిత దీప్తు
చంద్రమండల సుధా సంపూర్ణ హాసమ్ము
    చిన్ని పెదవులందు చిందువాని
వరదాభయమ్ముల వర్తిల్లు ముద్రల
    చిట్టిచేతులు రెండు చెలగువాని
దుష్టశిక్షణ వృత్తి శిష్టరక్షణ దీక్ష
    పదముల తాటించి వరలువాని
చిన్నారి బొజ్జలో శ్రీరామరక్షగా
    భువన భాండమ్ముల బ్రోచువాని
యోగమాయాతీతు యోగి మానస హంసు
    అవ్యయు నచ్యుతు నాదిపురుషు
శ్రీవత్స కౌస్తుభ చిహ్న భూషితవక్షు
    నీలమేఘశ్యాము నీరజాక్షు
అష్టాక్షరీ మంత్రమాకారమునుఁ దాల్చి
    వెల్గొంది విలసిల్లు పిల్లవాని
శ్రావణ బహుళాష్టమి నాటి రాత్రివేళ
మింట రోహిణి తారక మెరయుచుండ
కఱకు చెఱసాల కడగండ్లు కరగిపోగ
కనియె దేవకీసతీ తన కాంక్షఁ దీర     8
బ్రహ్మను నియమించు పరమాత్ముడయ్యును
ధాత చేతివ్రాత తలను దాల్చి
పురిటి బాలుడయ్యె పుండరీకాక్షుండు
ధర్మము నెలకొల్ప ధరణిలోన         9
కృష్ణుణ్ని వ్రేపల్లెలో నందునింటికి చేర్చాలనుకున్న వసుదేవుడు... 
వెదురు జల్లెడలోన వెచ్చంగ మెత్తంగ
    పొత్తిళ్ల నొత్తుగా బొత్తిఁ జేసి
పురిటి బిడ్డనుఁ దీసి పొత్తిళ్ల మధ్యలో
    నెనరు మీరగ నుంచి నిదురపుచ్చి
పైపంచె వస్త్రమ్ము పదిలమ్ముగా చింపి
    పసివాని మేన దుప్పటిగ కప్పి
కన్నబిడ్డ నుదుట కడసారి ముద్దాడి
    బుజ్జి కన్నయ్యకు బొజ్జ నిమిరి
గుండె బిగియబట్టి కొమరుని తలకెత్తి
తరుణివంక నొక్క తడవఁ జూచి
గుబులు వీడి మదిని గోకులమ్మునుఁ జేరు
దెసకు చనియెను వసుదేవుడంత     10
వాళ్లను చూసిన యమున తన్మయం... 
పరుగున నరుదెంచు వసుదేవు శిరముపై
విశ్వరూపుడైన పిల్లవాని
విష్ణుమూర్తిఁగాంచి వినయాంతరంగయై
దారినిచ్చె యమున తన్మయమున.    11
కృష్ణుణ్ని చూసిన గోపకాంతలు... 
కన్నులు మురియగ పున్నమి
వెన్నెల వన్నెలను చిల్కు వెన్నుండితడే!
పున్నెము లెన్ని యొనర్చెనొ?
యిన్నందు పొలతి సుతునిగ నీతని
 బడయన్‌.12
అని మురిసి, ఇలా జోలలు పాడారు...
లాలీ! లీలాలోలా!
లాలీ! గోపాల బాల! లాలీ! లాలీ!
లాలీ! గోకుల తిలకా!
లాలీ! రాకేందు వదన! లాలీ! కన్నా!   13
ముక్తి రత్నాలు
కృష్ణుడి చిన్నతనంలో ఓ రోజు గోపవాడలోకి ఓ పళ్లమ్మి వచ్చింది. ఆమె దగ్గర పళ్లు తీసుకుని, మారుగా కొంత ధాన్యం ఆమె బుట్టలో పోశాడు కన్నయ్య. తర్వాత అవి మణి మాణిక్యాలుగా మారాయి. దాంతో పళ్లమ్మి ఈ పిల్లవాడు బాలుడు కాడు, పరమాత్ముడే అనుకుని, తన భాగ్యానికి మురిసిపోతుంది.
మధురమైన పండ్లు! మధురసమ్ముల పండ్లు!
కొనుడు! ధాన్యమిచ్చి కొనగరండు!
పిల్లలార! యంచు వ్రేపల్లె వీధిలో
పండ్ల నమ్మవచ్చె పడతి యొకతె.     1
అమ్మి! యిటుల వేగరమ్ము! రమ్మనిపిల్చి
తాను వడిగ యింటిలోని కరిగి
చిట్టి దోసిలొగ్గి చిన్నారి కృష్ణుండు
ధాన్యమందు కొనుచు త్వరగ త్వరగ     2
చిన్నారి చేతులందున
పన్నుగ ధాన్యమ్ము పట్టి పరుగున రాగా
ఉన్నవి రాలగ మిగిలిన 
కొన్నింటిని పట్టుకొనుచు కూరిమి తోడన్‌ 3
చిట్టి దోసిలొగ్గి బుట్టలో పోయంగ
ముద్దుకృష్ణుఁగాంచి మురిసి, మురిసి
చిన్నినాన్న రార! కన్నయ్య! రమ్మంచు
ఎత్తుకొనుచు నెదకు హత్తుకొనుచు     4
ముద్దులాడి, మరల మురిసి, నేలకు దించి
బుజ్జి బుగ్గ నిమిరి పుణికి పుచ్చి
ఇంద తీసికొమ్ము! ఇవియన్ని నీవంచు
పండ్లనన్ని యిచ్చె పడతి యంత     5
చిన్ని కృష్ణుడంత చిరునవ్వు లొలికించి
చిట్టి చేతులదిమి చేర్చి పట్టి
పండ్ల నదుముకొనుచు, పండ్లమ్మి! శలవంచు
లోనికేగె హర్షలోలుడగుచు.         6
బుట్ట నెత్తుకొనుచు బుట్టలో రాశిగ
కాంతులీను దివ్య కనకరత్న
భూషణముల గాంచి పొలతి విస్మయమొంది
తలచె నిటుల హర్ష తరళయగుచు     7
బాలుడేమి గాడు, పరమాత్ముడీతండు
ధరకు దిగిన శారఙధరుడు గాని
వీసమెత్తు నాదు ప్రేమభావమ్మున
కమితమైన సిరుల నందఁజేసె.     8
శ్రీ మహావిష్ణువు వైభవం
పాలసంద్రమ్మున వసియించు పరమాత్మ
    పసుల కాపరులింటి పంచఁ జేరె
భోగీంద్ర శయనుండు బుజ్జి పాపాయిగా
    తూగుటుయ్యాలలో ఊగి తూగె
శంఖ చక్రమ్ముల సారించు విష్ణుండు
    లక్కకాయలు చేతులందు పట్టె
నిగమాగమములకు నెలవైన దేవుండు
    ఉంగా ఉంగాయంచు ఊసులాడె
సౌఖ్యభావమందు సంగమెంతయు లేక
ధర్మకార్య నిపుణ దక్షులగుచు
అలతి పదములందు నాశ్రయమ్మునుఁ గోరి
అనఘు లవతరింతు రవనియందు    14
      అలా, విశ్వస్థితి కారకుడైన విష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించిన ఘట్టం సుమనోహరం. ఆ కన్నయ్య కథా శ్రవణం అతి రమ్యం.  

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరుగు

అరుగు

డా.రంకిరెడ్డి రామ‌మోహ‌న‌రావు


మరుపురాని అద్భుతం

మరుపురాని అద్భుతం

శ్రీదేవి సురేష్‌ కుసుమంచి


ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


రాగమాలికలు

రాగమాలికలు

డా।। అన్నపురెడ్డి శ్రీరామరెడ్డి


వాళ్ల నుంచి నేను

వాళ్ల నుంచి నేను

చంద్రబోస్‌


చెమర్చిన కళ్లు

చెమర్చిన కళ్లు

గంజాం భ్రమరాంబ