కలవరం

  • 76 Views
  • 1Likes

    మౌనశ్రీ మల్లిక్

  • హైదరాబాదు.
  • 9394881004

ఒక అపరిచితరాగం
హృదయతంత్రులమీద పారాడుతూ
కరడుగట్టిన శరీరశిఖరం కింద
చలిమంటలు వేసి నవ్వుతోంది
నులివెచ్చని హాయిలో రగిలిన జ్వాల
దావానలమవుతుంటే
దేహపొరల్లోంచి స్వేద నదాలు
జలజల జారిపడుతున్నాయి
ఆ రాగం...
జలధారల సవ్వడుల్లో లీనమవుతూ
పక్షిలా మారి
చెట్టుకొమ్మ మీద వాలి
రెప్పలార్చుకుంటోంది
తెంచుకోలేని సామాజిక సంకెల
మసకబారుతున్న చూపును వెక్కిరిస్తోంది
అల్లుకున్న గాఢమైన బంధాలు
నైతికత సంగతేంటని పోరుపెడుతున్నాయి
నమ్మిన సిద్ధాంతం కరవాలమై
కక్ష సాధింపు చర్యలకు ఒడిగడుతోంది
బిగుసుకుంటున్న ముడి నిగళమై
నన్ను బంధిస్తోంది
జలపాతాలను అధిరోహించలేని
ఊర్ధ్వచలనకాంక్ష
గోడమీది పిల్లిలా దోబూచులాడుతోంది
మధురమైన ఆ రాగం
నిర్జనవారధిపై మంద్రంగా సాగిపోతూ
బుసకొడుతున్న కోరికను అంచనా వేస్తోంది
విరబూసిన పున్నమి వెన్నెలలో
కడలి తన అస్తిత్వాన్ని కోల్పోతోంది
చెలియలికట్ట దాటలేని అసహనంతో
అలలు తీరానికేసి తలలు బాదుకుంటున్నాయి
అర్థంకాని శూన్యాన్ని
కౌగిలించుకున్న బాహువులు
ఎదలను బాదుకుంటూ
కాలాన్ని ప్రార్థిస్తున్నాయి
మసకబారుతున్న నయనాలు
రేపటి సందిగ్ధాన్ని
చూడాలని ఆరాటపడుతున్నాయి
కొమ్మమీది నుంచి ఎగిరిన పక్షి
కాసేపటికే నిశీధినీడలో కలిసిపోతోంది
మూతలు పడిన కనురెప్పలు
తిరిగి తెరుచుకునే వరకు
ప్రాణాలను కదిలించిన గమకాలను
కలవరిస్తూ పలవరిస్తూ
కలలు కంటూనే ఉంటాను
దుఃఖిత కవితనై వర్షిస్తుంటాను.
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఒక ఎండు చేప మరొక పాత టైరు

ఒక ఎండు చేప మరొక పాత టైరు

ఇంద్రపాల శ్రీనివాస్‌


నవవర్షం నవరాగం

నవవర్షం నవరాగం

జి.పాండురంగారావు


పరిణయం

పరిణయం

ప్రియాంక వజ్రాల


తొలకరి

తొలకరి

నారాయణమూర్తి తాతా