నవ్వుల ‘వన’మాలి

  • 310 Views
  • 2Likes

    ఆచార్య జయశ్రీ నాయుడు

  • దుండిగల్‌.

నిశ్శబ్దపు ఫ్రేముని చీల్చుతూ
మాటల కాన్వాసు విస్తరిస్తున్న వేళ
ఒకానొక క్షణంలో
మనసులో స్పందనల వర్ణచిత్రం
మోనాలిసా నవ్వేకాదు
నేస్తపు నవ్వూ సమ్మోహనమే
ఎదురయ్యే మనసులెన్నో ఉన్నా
ఆత్మీయమైన ఆర్తి పరిమళం అరుదు సుమా
దిన దిన ప్రవర్ధమానంగా
ప్రయాణించిన స్నేహం అలంకరించుకున్న
నవ్వుల లెక్కలు లెక్కలేనివి
సుగంధంతో మోహనాలను కూడిన హృదయసుమం అది
కొన్ని భావాల మొలకలు
తెలుపు నీలం లేతాకుపచ్చ పాదులు
అవును కాదుల చిగుళ్లు తొంగిచూసిన
లిల్లీ కాడల్లా నాజూకు నవ్వులు
గుండెని పరుస్తూ నడుస్తూ
అలా బాల్యపు వాహ్యాళిని గుర్తు తెచ్చుకున్నప్పుడు
యవ్వనపు పాదుల్లో భవిష్యత్తుని అంట్లు కడుకుతున్నపుడు
ఒకే మొక్కకి పసుపు తెలుపు గులాబీలు నవ్వినట్టు
గుంభనపు నవ్వులు విరిసేవి
స్థిరపడ్డ కక్ష్యలో
స్థిమిత పడ్డ గ్రహగతిలాంటి వేళల్లో
అకస్మాత్‌ ఒత్తిళ్ల శకలాలు ఢీకొట్టిన సమయాల్లో 
ఒడుదొడుకుల ముళ్లు గుచ్చుతూ
ఆత్మవిశ్వాసాన్ని సంబాళించి పట్టుకునే
తనను తాను వెన్ను తట్టుకునే
నీళ్ల ధారల్లాంటి నవ్వు
దుఃఖపు స్క్రూలు గుండెలో 
వలయాల్లా ఒరుసుకుంటూ పోతున్నా
హుందాతనపు కొమ్మలు దట్టమై
మొహమాటపు పూగుత్తుల్ని అడ్డుపెట్టుకుని
కొసరి కొసరి వడ్డించే అమ్మ మనసులా
గాంభీర్యపు మమతల నవ్వు
మధ్యాహ్నపు టాకాశంలో నిశ్చల తీక్షణపు సూరీడులా
స్నేహం పాదుకున్న కొమ్మ చివర మందారంలా
గుండె మందసంలోంచి
ఒక్కో రేకా విప్పి చూపుకున్న రహస్యపు నవ్వులు
నువ్వూ నీ నవ్వూ
విడివిడిగా మనలేవు
నవ్వునే నిరంతరపు దిక్సూచీగా
నీకన్నా ఎవరు నవ్వగలరు నిష్పూచీగా...
నేస్తమా...
నిండైన నవ్వులా
స్ఫటికపు స్వరంలా
మట్టిని చీల్చుకుని వచ్చే
తొలి మొలక తేటదనంలా
అలాగే ఉండు ఎప్పటికీ!
మనలో మనసుల్లో ఆ నవ్వుల నారుమడుల్ని
స్నేహసుమాల్లా విత్తుకుందాం
తోటమాలిగా కాపాడుకుందాం!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


సందడి

సందడి

డా।। బి.వి.ఎన్‌.స్వామి


కచేరీ

కచేరీ

కోడూరి రవి,


ప్రకృతి పలికిన గీత

ప్రకృతి పలికిన గీత

ఎ.ఎస్‌.డి.రవిశంకర్‌


భావకేదారం

భావకేదారం

సూరారం శంకర్‌


పరిమళాల పరిష్వంగం

పరిమళాల పరిష్వంగం

అనితాసూరిబాబు