కలల దుప్పటి

  • 1054 Views
  • 0Likes

    కస్తల విజయబాబు

  • విజయవాడ
  • 9440133820

నిద్రను నిషేధించాలని నిర్ణయించుకున్నాను 
మరేం చేయాలి? 
ఆ కదిలి కరిగే కాలం 
నా కళ్లూ ఏకమై నామీదే
అవిశ్రాంత యుద్ధం ప్రకటించాక!
పగటి పూట ప్రాణం పోసుకున్న ఊహలకు ఊసులకు
రాత్రివేళ రంగుల రెక్కలు తొడుగుతుంటే...?
అందుకే నిద్రను నిషేధించాలని
నిర్ణయించుకున్నాను. 

నిద్రలో పుట్టి నిద్రలో పోతే 
నిద్రను నిషేధించాలని
అసలు అనుకునేవాణ్నే కాదు!
నిద్ర లేవగానే, నిద్రలో పుట్టిన కల
నా చూట్టూ కాబూలీ వాలాలా
మళ్లీ మళ్లీ తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నా
ఊహలకూ, ఊసులకూ
ఉరితాడుని ఎలాగూ పేనలేను
అందుకే నిద్రను నిషేధించాలని
గట్టిగా నిర్ణయించుకున్నాను!

చిన్న చిన్నగా చీకటి చిక్కబడుతుంది
గడియారం ముళ్లు సోమవారం
బడికి వెళ్లే పిల్లాడి కాళ్లలా....
అద్దంలో కనుపాప లోతుల్లోకి తొంగి చూస్తున్నా
కలల జన్మస్థానం కనబడుతుందేమోనని!
అలసిన కనురెప్పలు అతుక్కోవాలని చూస్తున్నాయి. 
నా కన్నులనే కప్పి కలకందామని!
చెంబుడు చన్నీళ్లతో వాటిని శిక్షించాను. 
నా మీద నేనే గెలుపొందాలని 
చేస్తున్న కురుక్షేత్రం.. ధర్మక్షేత్రమిది!

నేను గెలిస్తే, నా పగళ్లు స్వర్గధామాలౌతాయి!
ఈ స్వప్నాల సన్నాయి నొక్కులిక ఉండవు 
భూపాల రాగం పాడుతూ
కల నన్ను మేల్కొలపదు
నన్ను పగలంతా ఉడికించదూ, గేలి చేయలేదు!

అసలు కలల జన్మస్థానమేది?
కళ్లా? మనసా? మెదడా? అస్తిత్వమేనా?
ఈ జన్మస్థానాల అన్వేషణ
ఈ నేలపై పుట్టినందుకు నాలో పెరిగిందా?
ఆలోచనల్లో ఉన్న నన్ను ఏదో ఒక మాయ 
ఉన్నట్టుండి కనురెప్ప పాటు కమ్మేసింది!
అంతే!!
సమాధి మీద పూసిన గడ్డిపూవులా
స్వచ్ఛంగా మరో కల విచ్చుకుని, వెక్కిరించింది నన్ను!
గతంలోని గతితార్కికం 
అనవసరమనిపించింది నాకు!
గెలుపు ఓటముల ఆవలి ఒడ్డుకు 
పరుగులు తీశాయి ఆలోచనలు
అసలు కలకు కారణమేమిటో? 
కల నన్నెందుకు కలవరపెడుతుందో? 
ప్రతి చర్చనూ పక్కన పెట్టాను. 
పక్కమీదకి వొరిగి 
కలకు స్వాగతం పలికాను!
కళ్లకు నా కలల దుప్పటి కప్పుకుని!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కలవరం

కలవరం

మౌనశ్రీ మల్లిక్


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి