సరిహద్దు

  • 890 Views
  • 0Likes

    డా.వై.రామకృష్ణారావు

  • మన్సూరాబాదు, హైదరాబాదు.
  • 8985743964

ఎన్నెన్నో సరిహద్దు రేఖల
కన్నీటి చారికలతో
ఈభూమి ఎంత పెద్దదైతే మాత్రమేమిటి?
ప్రతిగీతకూ అటూ, ఇటూ
మనుషులు పరాయివాళ్లే, పరదేశీలే -
సాగరజలాలకీ సరిహద్దులే
ఓ చేపపిల్లకోసం
పడవ గీత దాటితే
బతుకంతా బందిఖానాలోనే!
కంటికగుపించక పోయినా
గగనతలం కూడా ముక్కలు చెక్కలుగానే మరి!
అదృశ్యరేఖను అతిక్రమిస్తే
నిషాదుడి శరాఘాతం
క్రౌంచ విహంగాన్ని కూల్చివేసినట్లు
లోహవిహంగాన్ని పేల్చి వేస్తుంది
సైనికుడి శతఘ్ని.
ఆవలి తీరంలో ఉన్నది అమ్మయినా, అక్కయినా
మనాదితో మధనపడి కలుసుకుందామంటే
అర్జీలు పెట్టుకోవాలి, అనుమతులు తెచ్చుకోవాలి.
నెత్తిమీద గొడుగులా ఉన్న ఆ మేఘం
ఎవరి నింగిమెట్ల పైనుంచి నడిచొచ్చింది?
ఏదేశం గాలి రథమెక్కి వచ్చింది?
ఏరాజ్యం నీరుతాగి
ఈనేలను అభిషేకించింది?
మేఘానికి సరిహద్దుల్లేవు - 
ఏ కొండమీద మనసైతే
ఆ కొండను కమ్మేస్తుంది.
ఏ కోనమీదనో గుబులైతే
వెళ్లి చల్లగా పలకరిస్తుంది.
మట్టిమీద, మనిషిమీద ప్రేమపుడితే
నింగి నుంచి దిగివచ్చి
సహపంక్తిని నడుస్తుంది.
మబ్బుకు కన్నీటి భాష తెలుసు.
అందుకే
శాపగ్రస్తుడైన యక్షుడితో చెలిమి చేసింది.
వివిధ వర్ణ ఆకృతులతో
వియత్తలంలో స్వేచ్ఛగా విహరిస్తుంది.
అంతలోనే
విద్యున్మహాగ్నిగా విస్ఫోటిస్తుంది.
దానికి
ఎడదపై ఏ రాజముద్రలూ లేవు
పౌరసత్వాల ఏ ‘ఆధారా’లూ లేవు
మరి
కొండ వాలున నాతో కలిసి నడిచిన మేఘం
ఏదేశానిదో చెప్పగలవా?

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కలవరం

కలవరం

మౌనశ్రీ మల్లిక్


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి