నా కవిత్వమంటే...

  • 1591 Views
  • 13Likes

    బత్తిన కృష్ణ


శ్వేత నీలికాంతి ధారల్లో
ఎంత తడిచినా చిరగని కాగితంపై
చెరగని అక్షరాలకు నా కవిత్వమంటే
సముద్రానికున్నంత సహనం ఉంది
అలల వరుసలపై కలల అక్షరాలని రాసి
నురగ నవ్వుల తీరానికి నా కవిత్వమంటే
సముద్రానికున్నంత అలసట ఉంది

విడిచొచ్చిన పొలిమేర బక్కచిక్కిన పంటకాలువ
ఊడలూగిన మర్రిచెట్టు బరిగీసి గిరికీలు కొట్టిన
పల్లెతల్లి ఒడికి నా కవిత్వమంటే
సముద్రానికున్నంత పనితనముంది

ధూళిపొరలను నోరార చవిచూస్తూ
ఏడ్చిఏడ్చి మేఘాలతో ముఖం కడుక్కుంటున్న 
ఆకాశానికి నా కవిత్వమంటే
స్తన్యం మీదగా తుళ్లిపడ్డ అమ్మఅశ్రువుకున్నంత
తియ్యందనముంది 

చెట్ల వెనుక చిరుచీకటి కిటికీలోంచి తొంగిచూస్తూ
సంధ్య వారలో జారుతున్న అస్తమయానికి
వదిలెళ్లిన గూడును చేరుకునే 
గువ్వల జంటకున్నంత గుబులు ఉంది
శిశిరాన్ని తరుముతూ వసంతాన్ని తడుముకుంటూ
సొనలుకారుతూ వగరుల చిగురులు తింటున్న కోయిలకి
నా కవిత్వమంటే... పొదుగును గుద్దుతూ కడుపారా తాగి
గంతులేసే లేగ గిట్టలకున్నంత పొగరుంది 

పునాదులు కూలిన రాజసౌధాల మీద నుంచి
ఎగిరిపోయిన పావురాళ్లకు నా కవిత్వమంటే
రాలినాకుల గలగలలకు రెపరెపలాడిన 
ఆ రెక్కలకున్నంత బెదురుతనముంది. 

తడిసిన ఆ నీలికాంతి ధారకి రాలినాకుల
గలగలలకు నా కవిత్వమంటే 
అక్షరానికున్నంత ఆనందం ఉంది 
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్