పొద్దు పొడుచు వేళనే...

  • 1782 Views
  • 3Likes

    ఎర్రాప్రగడ రామమూర్తి

  • విశ్రాంత ఉపాధ్యాయుడు
  • ఖమ్మం
  • 9959352900
ఎర్రాప్రగడ రామమూర్తి

గాలి కెరటాలు చిగురు జొంపాలపైన
సిరి జిలుగుతెరలు కదిలించి మురిపించె
వూహలుయ్యాల జంపాల లూగసాగె
పూర్వగిరి రాగయోగమై పొద్దుపొడిచె.
    అంతములేని కాలమధురాద్భుత కావ్య సహస్రకోటి ప
    ద్యాంతర పాదమొక్కటి వెలారినదింత మహోదయాంశువై
    వింతల దొంతరల్‌ గగనవీధులు తాకగపేర్చుచున్‌; తద
    శ్రాంత పదాలలోని యొక శబ్దలవాన విలీనమౌదునా!
అక్క, బావ వరుసలతో నాదరాన
పలుకరింతల పులకరింతలు చెలంగ,
పల్లె అందాల పందేర మెల్లజనులు
పొందితీర వలయు పొద్దుపొడుచు వేళ.
    అల్లవిగో వినీల విమలాభ్రము ముద్దిడు వృక్షరాజముల్‌
    చల్లని పల్లె తల్లి కనుసన్నల నన్నుల మిన్నలయ్యె, ఆ
    పల్లములోన దూకు జలపాతము పుట్టిన గుట్టపైన న
    ల్లల్లన మేయు పాడి పసరాలవి యెల్ల సుధాస్య దృశ్యముల్‌.
అదె మన పల్లెవాగు! మనసంతయు దానికి పుణ్యభావమే!
ఎదురుగ దానియొడ్డున మహీజము నందొక తల్లికొంగ అ
ల్లదె తన చిన్నికూనలకు నాకలికేకల నోట పెట్టుచు
న్నది చిరుచేపలన్‌; ప్రకృతి నాయము లోతులు చూడశక్యమే?
    చతురత నీటిబిందియలు చంకన, నెత్తికి నెత్తుకొంచు వా
    గు తరగలందు చిందిపడు కోమల కాంతులు మోములందు హ
    త్తి, తిరిగి ఇంటికేగు యువతీమణు లాదెసదారి మొత్తమున్‌
    సిత జలజాత పాతముగ జేయుదురల్లదె వింత చూడరే!
పల్లెయె తాను, తానె సిరిపల్లెగ ప్రాణము ప్రాణమై, తరాల్‌
చెల్లిన రైతు జీవనమిసీ! కడునుద్ధృతమై అపాయముల్‌
వెల్లువలై సుడుల్‌ తిరుగ వేధల వీథులకెక్కె ముక్కలై;
చిల్లులు పడ్డవేమొ విధి చిన్మయ కర్ణములష్ట దిక్కులన్‌.
    కోతల యంత్రమంత్రములు గుట్టున బిడ్డల పొట్టకొట్టినన్‌
    మా తలరాత యింతెయని మౌనముగా పడియుండి, తాతము
    త్తాతల నాటియప్పు ఋణదాతలు నెత్తిన రుద్దుచుండగా
    రైతులు వేరుదారి కనరాక శపించిన లోకమేమగున్‌?
ఆకలి బుజ్జి బొజ్జలకు నన్నము పెట్టెడు పుట్టెడాశతో
వేకువ జామునే కనులు విచ్చి, పొలమ్ముల దారిజొచ్చి, భూ
లోక కుటుంబమెల్ల తనలో గలదంచు శ్రమించు రైతు బా
ధాకర కృత్యమొప్పనక తప్పక పాల్పడె నాత్మహత్యకున్‌.
    చేపవు తల్లియావులు; నిషేధములుండవు జల్గ రక్తదా
    హాపర కాంక్షకున్‌; కనుల కందవు చేతులకందు మూలముల్‌;
    దాపున కేగలేవు పరదైవము చూడ విషాద దృశ్యముల్‌;
    పాపము పండ బారునెడ పర్యవసానము ఘోర శాపమౌ.
విపణి దవానలంబు, ఋణవీథి పిశాచ విలోచనాకులం
బు, పురుగుదండు రాక్షస సమూహము, నాగలి నాగుపాము, బొం
దు పొలము బోరుబావి విషతోషణమై అరెరే! నిజమ్ము! పొ
ద్దు పొడుచు వేళనే హలిక దుఃఖపయోధిని పొద్దు గ్రుంకెరా!

*  *  *

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత