స్మృతులుగా తెగిపడుతూ...!

  • 237 Views
  • 1Likes

    సిరికి స్వామినాయుడు

  • పార్వ‌తీపురం, విజ‌య‌న‌గ‌రం జిల్లా
  • 9494010330

వాళ్లు,
రాతిరి కొమ్మ మీంచి కూసే...
రాగరంజిత కలకూజితాలు!
పద్యమే తామైనట్టు - తామే పద్యమైనట్టు
కళామతల్లి పాదాలచెంత
తలవాల్చిన కమనీయ పద్యమాలికలు!
నాలుకమీద పద్యపాదాల్ని నాట్యమాడించి
పురాణపాత్రల్లోకి పరకాయప్రవేశం చేసిన పరమసిద్ధులు!
కష్టాల గరళాన్ని దిగమింగి
కంఠసీమలో పద్యాలపంట పండించిన హాలికులు!
కన్నీటికుంచెతో రంగస్థలం మీద
అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించిన కళాకారులు!
ఆకలికేకల్ని హార్మోనియంతో శృతిజేసి
రాతిరి గుమ్మానికి రాగతోరణాలు కట్టిన పాలెగాళ్లు!
పండగసంబరాల్లో పల్లెను పెళ్లికూతుర్ని జేసి
పద్యాలపల్లకీలో ఊరేగించిన బోయీలు!

రేయంతా వెలిగిన ఆ రాగదీపాలకు
చెమటచుక్కల చప్పట్లహోరే చమురయ్యేది!
చివికిన చీనాంబరాలు, ఢాకా రేకులాభరణాలు
రేయికద్దిన రంగుల కలలఅద్దం
పొద్దు దూరేసరికి భళ్లున పగిలిపోయేది!
‘జీవితమూ ఒక నాటకరంగమే కదూ....’
వైరాగ్యంతో ఒకడు మౌనంగా నడచిపోయే దృశ్యం!
రాతిరిపూసిన రాగాలచెట్టు మీంచి
పద్యం పావురమై ఎగిరి పొద్దుగట్టు మీద
పల్లెవాసుల పెదాలమీద వాలే జ్ఞాపకం!

మనకది నాటకమే... కానీ వారికది జీవితం!
అప్పులకోసం తాళిని తాకట్టు పెట్టి 
కామందు దొడ్లో కంబారిగా మారినపుడు
అతడో హరిశ్చంద్రుడే!
ఆకలిసర్పం కాటేసిన కొడుకును తలచుకొని
శోకమూర్తిగా మారినపుడు ఆమె ఒక చంద్రమతే!
కళ్లవెనుక చీకటిని దాచిపెట్టి - వాళ్లు
రంగస్థలాన్ని రసాధిదేవతలై రక్తి కట్టించినపుడు
పల్లెపల్లెంతా పులకించిపోయేది!

కళకోసమే బతుకునంకితం జేసుకున్న
తరాలసంస్కృతీ వారసత్వాన్నిప్పుడు
కాటేసింది కేబుల్‌ కట్లపాము!
గూగుల్‌ గూట్లో....
రెక్కలు తెగిన పక్షయింది పద్యం!
సైబర్‌ చితిమంటల్లో
కాలిపోతోంది సనాతన కళారూపం!
రీళ్లరాకాసి నీడలో...
రంగస్థలమిపుడొక శ్మశానఘట్టమయ్యేచోట 
కాలంచెక్కిట
ఘనీభవించిన కన్నీటిచారికలై....వాళ్లు!
ఆ సామూహిక సమాధుల మీద
స్మృతులుగా తెగిపడుతూ....మనం!!

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ప్రాణాధారం

ప్రాణాధారం

డా।। పింగళి గంగాధర్‌ రావు


అమృతం తాగిన ఆకాశం

అమృతం తాగిన ఆకాశం

జి.నరేష్‌ కుమార్


సంకురాత్రి గొబ్బిలక్ష్మి

సంకురాత్రి గొబ్బిలక్ష్మి

దాసరి కృష్ణారెడ్డి,


గోదారి...గోదారి...గోదారి

గోదారి...గోదారి...గోదారి

నేతల ప్రతాప్‌కుమార్‌


ములాఖత్‌

ములాఖత్‌

బండారి రాజ్‌ కుమార్‌


సంద్రమే నా లోకం

సంద్రమే నా లోకం

గంటి వెంకటరమేష్,