పాళీ పెన్ను

  • 165 Views
  • 12Likes

    చౌద‌రి తార‌కేశ్వ‌ర‌రావు

  • గూడూరు, నెల్లూరు జిల్లా
  • 9948930540

అటక మీద దస్తావేజులు తిరగేస్తుంటే
హఠాత్తుగా గుర్తొచ్చింది
ఎక్కడెక్కడ వెతికానో తన కోసం!
‘మీ దగ్గర ఉందా?’ అని అడిగిన చోటల్లా
జవాబు లేని ఎదురు ప్రశ్నొకటి
‘‘ఏ కాలంలో ఉన్నారు సార్‌?’’
ఎన్నిచోట్ల తిరిగానో తన కోసం!
మొత్తానికి దొరికిందొక చోట!
చిన్నప్పుడు చేతుల్లో ఆడుకుని
నా జ్ఞానానికి మెరుగులు దిద్ది
దూరమయిపోయిన నేస్తం...
చేతకాకో... చేయి తిరక్కో
వంకర టింకరగా వర్ణమాల రాస్తే
గురువు గారి బెత్తం దెబ్బలు
రుచి చూపించిన నేస్తం!
‘ఇలాంటిదొకటుందా?’ అంటూ
నా శిష్యులను ఆశ్చర్యంలో ముంచెత్తిన నేస్తం!
ఇన్నాళ్లకు దగ్గరయ్యింది.
మీ కళ్లతో చూడకండి
స్లిమ్‌గా ఉండే జీరోసైజు కాదు.
బొద్దుగా ఒద్దికగా
జేబులో ఒదిగిపోయింది.
ఎదసవ్వడి విన్నదేమో!
గుండెగుట్టు విప్పి చెబుతానంది!
ఖాళీ కడుపుతో ఉంది కదా
కాస్త ఇంధనం నింపమంది
మొరటుగా కన్పించినా
మనసు చెప్పిన ఊసులను
పొందికగా పేర్చేసింది.
ముద్దులు కురిపించి, సుద్దులెన్నో చెప్పి
జోలపాడి నిద్రపుచ్చిన అమ్మలా
హృదయానికి దగ్గరై
నిశ్చింతగా ఉండమని ధైర్యం చెప్పింది.
‘నువ్వూ... నీ ఛాదస్తం’ అని నవ్వుకున్నా సరే
కుప్పలు తెప్పలుగా దొరికే
‘యూజ్‌ అండ్‌ త్రో’లున్నా సరే
మోజు తీరలేదు దీని మీద
చేతితో దొరకబుచ్చుకొని
మునివేళ్లతో తడుముతుంటే
అందాల సుందరి మెలికలు తిరిగినట్టయింది
పాలరాతి బొమ్మలా నునుపు తేలిన దేహం
మీద ముసుగు తొలగిస్తే 
బంగారపు వర్ణం
నంది తిమ్మనకీ అందని నాసికం
శుక్రాచార్యునికి ఎరువిచ్చిందేమో?
ఒక్కటే నయనం
నాలుక - కలకత్తా కాళిక
ఎన్ని కావ్యాలను వర్ణించి సృజించిందో?
ఎంత మందితో స్నేహం చేసిందో?
బయట పెట్టలేక సతమతమై
మనసు పడే ఎన్ని గింజులాటకు
నేనున్నానని మార్గం చూపిందో?
ఎన్నెన్ని ప్రేమ లేఖలకు సాక్ష్యమయ్యిందో?
ప్రపంచ భాషలన్నీ తెలిసినా
మౌనం వహించి
మౌన భాషకూ లిపిని తయారు చేసింది. 
కవితా వస్తువు తనే అన్నప్పుడు
సంగతులన్నీ చెప్పేసింది.
మారిపోయిన వాటితో మారలేక
ఆదరించే పెద్ద మనసు కోసం 
హృదయాన్ని ద్రవంగా మార్చి 
వేయి మెదళ్ల కదలికలను సిరాచుక్కలు చేసి
ఎదరు చూస్తూ నిల్చొంది
పాళీ పెన్నుగా...
సమాజానికి దన్నుగా!

 

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ప్రాణాధారం

ప్రాణాధారం

డా।। పింగళి గంగాధర్‌ రావు


అమృతం తాగిన ఆకాశం

అమృతం తాగిన ఆకాశం

జి.నరేష్‌ కుమార్


సంకురాత్రి గొబ్బిలక్ష్మి

సంకురాత్రి గొబ్బిలక్ష్మి

దాసరి కృష్ణారెడ్డి,


గోదారి...గోదారి...గోదారి

గోదారి...గోదారి...గోదారి

నేతల ప్రతాప్‌కుమార్‌


ములాఖత్‌

ములాఖత్‌

బండారి రాజ్‌ కుమార్‌


సంద్రమే నా లోకం

సంద్రమే నా లోకం

గంటి వెంకటరమేష్,