రాత్రంతా మేలుకుని పనిలేక రెండు గాజు ముక్కలు నమిలాను
కళ్లలో కాలం కారం కొట్టింది.
ఇనుప తెరల గాలికి జీవితం వణుకుతోంది.
రాక్షసి బొగ్గులాగా ప్రేయసి మండుతోంది.
ఎంత నడిచినా రైలు పట్టాలు కలవడం లేదు.
కాలప్రవాహంలో కొట్టుకొస్తున్న ముళ్లు
ఇక్కడే నీళ్లు నములుతూ చీకటి కౌగిలిలో సేదతీరుతున్నా
ఇనుప గుగ్గిళ్లు భలే రుచిగా ఉన్నాయి
కత్తుల పాన్పు గమ్మత్తుగా మెత్తగా ఉంది.
చీకటి వెలుతురుగా, వెలుతురు చీకటిగా
విషఫలాలు మహారుచిగా అన్పిస్తున్నాయి.
చిన్నప్పుడు మింగిన భాస్వరం గొంతులో మండుతోంది.
బొడ్లో దాచిన కత్తి మెత్తగా దిగుతోంది.
అరణ్యంలో ఒంటరి పయనం
సైకిల్ పంక్చరైంది. ఇప్పుడో విమానం కావాలి.
అబ్బే... ఆశయాలతో నిన్ను ఎవడూ కొలవడూ!
సందు చివర బామ్మ నవ్వింది! ఎందుకో?