నిద్రకళ్ళ నింగిని
సూదిలా పొడుస్తూ పొద్దు
పిట్టల కిలకిలలతో
కువకువలాడుతూ వేకువ
లేస్తూనే తెల్లబడుతున్న
ఎర్రటి తూరుపుకొండ
ఫెళఫెళలాడే ఎండని
నేలంతా కప్పుతున్న అంబరం
చిరిగిన చీకటి ముక్కలు
మొలకు చుట్టుకున్న వెలుగు
సాయంత్రం చీకటిలోకి
గోళీలుగా దిగడుతున్న వెలుగు
పిలిచే సంద్రపు పిల్లగాలి
కనుగీటే వంకర వెన్నెల
ఎండ బెట్టిన వడియం
పండ బెట్టిన మామిడిపండు
దంచి కొట్టిన ఆవకాయ
బహుసా, స్మార్ట్ ఫోన్‌తో
నిన్నటిదో, రేపటిదో
వేసవి సెల్ఫీ అయివుండవచ్చు