బడి వాసన

  • 434 Views
  • 0Likes

    పక్కి రవీంద్రనాథ్‌

  • పార్వతీపురం, విజయనగరం జిల్లా
  • 9440364486

నిజమే...బడికీ ఓ వాసనుంటుంది
ఆటయి వెంబడించిన మట్టి వాసనో..
బడితోటలో విరిసిన చెమట పూల వాసనో...
పాటలతీరాన వాలిన పక్షి రెక్కల వాసనో...
చెట్టెక్కాలని ప్రయత్నించి జారిపడ్డ
పిల్లాడి మోచేతికైన పచ్చిగాయపు వాసనో...
లేదూ.. సప్త స్వర సమ్మిశ్రితమైన సంగీతంలా
ఇన్ని వాసనలొక్కటై కలగలిసి వీచిన
వింత వాసనో...
మనమెప్పుడూ గమనించలేదు గానీ
బడికీ ఓ వాసనుంటుంది.

కలలను మోసుకుంటూ
రాకెట్లా రివ్వున ఎగిరే కాగితపు వాసనో...
విద్యార్థి మస్తిష్కంలో మొగ్గ తొడిగిన ప్రశ్న
కొత్త సమాధానమై విచ్చుకున్న వాసనో...
అప్పుడే తల్లి ఒడిని వీడి బళ్లోకొచ్చిన
పసిదేహం నుంచొచ్చే అమ్మతనపు వాసనో
రేపటిలోకం కోసం నొప్పులు పడుతున్న
తరగతి గది పురిటి వాసనో...
నానాజాతి వృక్ష పరిమళాలొక్కటై
గుప్పుమన్న అడవిలాంటి
ఒక అద్భుతమైన వాసనో...
మనమసలు గుర్తించనేలేదు గానీ
బడికీ ఓ వాసనుంటుంది
పీకల్లోతు దాకా నూనెలో మునిగి
నిప్పును కావలించుకుంటేగానీ
వత్తి దీపం కాలేనట్టు
శిష్యుల్లో ఒకడై మెలిగి
వారి అంతరాత్మలను స్పృశిస్తేనే గానీ
తెలియనిదీ బడివాసన

ఆభరణాన్ని తయారుచేస్తున్న
అద్భుత స్వర్ణకారుడొకడు
తనను తాను నగలో పొదుగుకుంటున్నట్టు
పిల్లల బేలకళ్లలోకి తదేకంగా చూస్తూ
అంతులేని వాత్సల్యాన్ని
పంచివ్వగలిగే వారికి మాత్రమే
అనుభవమయ్యే వాసన...

అమ్మతనాన్ని, నాన్నతనాన్ని
ఏకకాలంలో దర్శింపజేస్తూ
అర్ధనారీశ్వర రూపం దాల్చగలిగే
అక్షర విధాత మాత్రమే
ఆస్వాదించగలిగే వాసన..

ఊరి ఎద మీద
ప్రపంచమొక పుష్పమై పులకించిన వాసన.
నిన్నటి నాగరికత మనిషి శిరస్సున
ప్రేమగా తురిమిన నక్షత్రాల వాసన.
చదువూ నేడొక పచారీ సరుకయిపోయిన
ఈ కాసుల లోకపు కాలుష్యంలో
నెమ్మదిగా మన మధ్య నుంచి ఆవిరయిపోతున్న
అరుదయిన వాసన.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


వాన

వాన

తానా మూర్తి


తేనె చినుకులు

తేనె చినుకులు

పిళ్లా చింత‌ప్ప‌డు