అమ్మకెవరు సాటి అవనిలోన

  • 67 Views
  • 0Likes

    కోడూరి శేషఫణిశర్మ

  • నంద్యాల, కర్నూలు జిల్లా
  • 9440754770

అమ్మచేతి బువ్వ అమృతోపమానము
ప్రేమయనెడి తేనె వేసి కలిపి,
కొసరి కొసరి పెట్టు కొడుకు కూతుళ్లకు
అమ్మకెవరు సాటి అవనిలోన!
ఉన్న కొద్దిపాటి అన్నమంతయు కల్పి
ప్రేమ తోడపెట్టు పిల్లలకును
‘లేదు ఆకల’నుచు లేచిపోవును తాను
అమ్మకెవరు సాటి అవనిలోన!
ఆటలాడి వచ్చి అలసిసొలసెనేని
అమ్మ చెంత చేరినంతలోనె
సేదతీరు మిగుల మోదమ్ము కల్గును
అమ్మకెవరు సాటి అవనిలోన!
ఉగ్గుపాలు పోసి ఉయ్యాలలో నూపి
నిద్రపుచ్చి నిన్ను భద్రముగను
నిద్రలేని రేయి నీ కోసమే గడిపె
అమ్మకెవరు సాటి అవనిలోన!
కాస్త ‘సుస్తి’జేయ కలవరపడిపోవు
వేయి మొక్కులిడును వేల్పులకును
సంతు మీది ప్రేమ ఎంతొ చెప్పగలేము
అమ్మకెవరు సాటి అవనిలోన!
మాతృగర్భమందు మనమెంతొసుఖమంది
వెడలి వచ్చినాము పుడమిపైకి
కాన్పు కష్టమెంతొ కన్నతల్లికి తెలుసు
అమ్మకెవరు సాటి అవనిలోన!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నువ్వెవరూ!

నువ్వెవరూ!

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


ఉగాది

ఉగాది

బి. రఘురామరాజు


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


సెల్ఫీ

సెల్ఫీ

నారాయణమూర్తి తాతా


నేటి బాల్యం

నేటి బాల్యం

టి.వెంకట చంద్రశేఖర్