ప్రేమంటే...???

  • 404 Views
  • 0Likes

    - జయశ్రీ నాయుడు

  • హైదరాబాదు
  • 9030012030

ప్రేమ...
తొలి మొలకలా జీవితాన్ని చీల్చుకుని తను పెరిగిందెప్పుడో తెలీదు కానీ ప్రకృతి అణువణువునా ప్రేమ వ్యాపించాలని చెప్పిన చిన్నతనం గుర్తొస్తోందిప్పుడు..
తొలిసారి నాగలి చాలు భూమిని చీల్చుతూ వెళ్తున్నప్పుడు, ఆ నాగేటి చాలు నేలపై ప్రేమ గుర్తు
ఆ పగలంతా నక్షత్రాల్ల విత్తులు రాలుతూ నల్ల రేగడి భూమి వాటిని గుట్టుగా దాచుకున్నపుడు 
అదే ప్రేమేమోనన్న సందేహాలు గుర్తు
వర్షం పడ్డ రాత్రి గడిచి ఉదయానికల్లా మొలకలైనప్పుడు స్నేహం తొలి రంగు అనుకున్న గుర్తు
కందిచేల లేత పచ్చదనం 
జొన్నచేల గాఢపు గరుకుదనం
వేరుశెనగ విత్తుల గుంభనం
మినుము పంట మూగతనం
అరటి గెలల బోళాతనం
చిక్కుడు పాదుల కలుపుగోలుతనం
ప్రేమకెన్ని ఛాయా చిత్రాలో...
గన్నేరు పూలని తెంపే వేళల్లో
నాసికని ముద్దాడే గాఢపు నాటుదనం
ఎర్రమందారం ఉదయాన్నే నవ్వితే
రెండు జడలకూ కొండంత చల్లదనం
వెన్నెల్లో ధగధగా మెరిసిన సన్నజాజులు
పూమాలల అల్లికలు నేర్పిన తొలి గురువు
నేలని తవ్వి విత్తులు నాటి నీరు పోసి
ఆకు ఆకుగా పువ్వు విత్తుగా తోటమాలిగా తొలిపాఠం
చిట్టి చేమంతులు పాదులో
వెన్నెల్లో కూడా నవ్వే చిట్టి నక్షత్రాలు
మట్టి ప్రేమనంతా గుప్పుమనిపించే ఎర్ర గులాబీలు
కళ్లల్లో పెట్టుకుని కాపాడుకున్న గుల్‌ మొహర్‌
ఒకటా రెండా ప్రేమకెన్ని సుగంధాల చిరునామాలో
పాదు పాదుకూ సరసరా నీరు పారుతుంటే
పిచ్చుకల స్నానాల కేరింతల్లో ఎంతటి ప్రేమ..
పూవు పూవు నుంచీ తేనె తాగుతూ తుర్రుమనే పిట్ట ముక్కు వంపునకు
సాయంకాలపు రావిచెట్టు ఇల్లయిన పిట్టల కువ కువలకూ
ఎన్నెన్ని ఊసులు పంచే ప్రేమో..
పరుగులెత్తే నీటిని పీల్చుకునే మట్టి సుగంధం ముందు
ఏ డియోడరెంట్‌ పోటీకి నిలుస్తుందో చెప్పగలవా..
వెన్నెల్లో లిల్లీ పువ్వుల నవ్వులు 
ఏ లుంబినీ పార్కు ఇవ్వగలదు
కంచెలా వ్యాపించే కాస్మస్‌ పువ్వుల హొయలు ఏ డిజైనరూ సృష్టించడు
పెకలించిన వేరునంటిన తడి మట్టి సుగంధం
ఇప్పటికీ గుండె నిండా ప్రేమై శ్వాసిస్తోందీ
మనిషి మారొచ్చేమో కానీ
మట్టి మారదు
అందుకే చెబుతున్నా
ప్రేమంటే..
ప్రకృతిలా మైమరిచి నవ్వే మట్టి సుగంధమే!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఇంతే...

ఇంతే...

మండపాక శివప్రసాద్


ఒక కవిత రెండు భాగాలు

ఒక కవిత రెండు భాగాలు

జూకంటి జ‌గ‌న్నాథం


దుఃఖితుడి చింత

దుఃఖితుడి చింత

టి.వెంకటేష్


కవి పద విరమణ

కవి పద విరమణ

గొల్లపెల్లి రాంకిషన్‌