రాదనుకున్న వాన

  • 513 Views
  • 4Likes

    డా।। బెల్లి యాదయ్య

  • నల్లగొండ
  • 9848392690

పొలంలో నిలబడి
దిగాలుగా ఎండ తలపైకెత్తి
నడినెత్తిన మిగిలున్న ఒక్కగానొక్క ఆశగా
ఆకాశం వైపు చూస్తుంటిని
భూమిలో కుమ్మరించిన
విత్తనాల అరిగోసను తలచుకుంటూ-
మబ్బులకావల గల
మహాసముద్రాల్ని పాపపుణ్యాలకు అతీతంగా వచ్చి
ఒక సాలేటి చినుకుల్ని
దుక్కిపై కురిసిపొమ్మని
ప్రాధేయపడితిని
నెమరువేయడానికి దుమ్ము తప్ప
ఇంకేంలేదని ఏడుస్తున్న ఎడ్ల పంటి కింద ఎడారిని చూస్తూ-
ఒకప్పుడు
గట్టు మీది చెట్ల పైన్నే
పక్షులతోపాటు ప్రాణవాయువుగా కాపురం చేసిన వాన
బాయి గడ్డ వెనకాలే
పోతరాజు గుండు పక్క గుడి కట్టుకున్న వాన-
ఒకప్పుడు
పొద్దుకోసారి ఉన్నూరికి ఇచ్చినబిడ్డలా చేలవైపునకు
గలగలా తొంగి చూసిన వాన
పాలకుతి లేసినప్పుడల్లా
తల్లి రొమ్మును చేరిపోయే ఆవుదూడలా
అవనికి సాగిలపడిన వాన-
ఒకప్పుడు
వాగుల ముఖాన జలకళనద్ది
మహేంద్ర చాపమే మనోరథమై చెరువు మత్తడి దుంకిన వాన
మోట దారుల మీంచి గంగ అలుగెల్లి
పొలమంతా కంషపిల్లల
నీటిసొర్గమైన వాన-
ఒకప్పుడు
నా గొర్రె గుంపు ఎన్నుమీదనే
వెచ్చని జలదరింపై ముసముసా
వణికిన వాన
ఏరువాక సంబురాలకు
ఏరుకు నడక నేర్పించి రైతును
కూతేసి రాగాలు తీసిన వాన
నరుని వికారాలపై తీవ్రంగా అలిగింది
మనిషి అకృత్యాలకు పూర్తిగా అదృశ్యమైంది-
కప్ప కాముడు వరదపాశం
జడకోలాటమూ వరుణభజనా
శ్రావణ బోనం అఖండ జ్యోతి
కరిగించలేవు మేఘాల గుండెను
ఇక రాదనుకున్న వాన
రాజ్యమేలేది
ముదాం కరువే కంకాళాలేనని నెల్లాళ్లు
నారుమడితో కలిసి దుఃఖాన్ని దిగమింగిన
అరకిడిసిన
నోట్లెకు మెతుకెట్లరా నరసింహా
గొడ్లకు మేతెట్లరా పరమశివా
బ్రహ్మదేవుడిట్ల రాసె నా నొసట గీతలను లెక్కించుకుంటూ
బాట పట్టిన
ఏదిక్కో తెల్వదు-
కొండ నమ్మకస్తురాలు
గొప్ప వరదాయిని
కాస్త ఆల్శెం అయినా జీడికంటి మూల మిలమిలా మెరిసింది
కుండపోతను వర్షించింది
ఆనందానికి అన్నిగేట్లు తీస్తూ
నిండిన నందికొండను ప్రసాదించింది-
కర్షకులారా!
ఇప్పుడు
వరి నాట్లు సరే
మన సాగులో రోజుకో మల్క
మళ్లీ రావాల్సిన వానలకై
పెరగాల్సిన సుందరవనాల కోసం
ఆకుపచ్చ కోండ్ర వేద్దాం
తలకో పది వృక్షాలై నేలతల్లికి ప్రణమిల్లుదాం.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఇంతే...

ఇంతే...

మండపాక శివప్రసాద్


జీవం కోల్పోయి..

జీవం కోల్పోయి..

ఎస్‌.ఆర్‌.పృథ్వి


ఒక కవిత రెండు భాగాలు

ఒక కవిత రెండు భాగాలు

జూకంటి జ‌గ‌న్నాథం


దుఃఖితుడి చింత

దుఃఖితుడి చింత

టి.వెంకటేష్