తెలుగు వెలుగు

  • 421 Views
  • 2Likes

    శ్రీధర్‌ కొమ్మోజు

  • వరంగల్
  • 7382621644

ఆవు పాలకన్న, అరిసె పాకము కన్న
తీపి గారె కన్న, తేనె కన్న
మధురమైన భాష మన మాతృభాషరా
తెలుగు భాష చవిని తెలుప తరమె!
అన్యభాష యెంత అవసరంబైనను
మాతృభాష విలువ మరువరాదు
అంతరించనీకు అమ్మ నేర్పిన భాష
ఆయువున్న వరకు అవనిలోన!
అన్యభాషలేమొ ఆత్మీయమాయెను
సొంత భాష పలుక శోష కలిగె
వనికి రంగులద్ద వాసంత మెట్లగు
కోకిలమ్మ తీపి కూత లేక?
తల్లి భాషనేమొ తక్కువని తలచి
ఆంగ్ల మాధ్యమమును హత్తుకొనిరి
అసలు చదువు కొరకు అనువైనదే భాష?
మాతృభాష తప్ప మారు కలదె?
కలలు కనెడివేళ, కష్టమొచ్చినపుడు
తల్లి భాషలోనె తల్లడిల్లి
మరచిపోదువేల మాతృభాషను నీవు
పలుకరించినపుడు, పలుకునపుడు?
గద్దెనెక్కి పిదప గతమంత మరచిరి
తల్లిభాష అమలు తలచరైరి
ఉత్తవాయె పూర్వ ఉత్తర్వులన్నియు
తెలుగు భాష వెతను తీర్చుటెట్లు?
సభలు నిర్వహించి సందేశములు యిచ్చి
భాషనుద్ధరింప బాస సేసి
ఆచరింప నిపుడు ఆలస్యమేలనో
మాట నిలుప వలెను మాన్యులింక!
ఉద్యమములు చేసి ఊళ్లన్ని కదలాలి
మాతృభాష విలువ మదిని దలచి
తెలుగు బతుకవలెను వెలుగులుబంచుచూ
పాఠశాలలందు, పలుకులందు!
తెలుగు నేర్చి నీవు తెలివినొందుటె కాక
ఇంటియందు పలుకు మింపుగాను
జనము మెచ్చు నిన్ను జనభాష పలుకగా
మనసు తెలుపు భాష మాతృభాష!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


 కరోనా విలయం

 కరోనా విలయం

సాహితీసుధ


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య