జయహో జయహో భారతధాత్రీ!
జయ జయ జయహో సుందరగాత్రీ
।।జయహో।।
సర్వసద్గుణా సాంద్రిత ధాత్రీ
సర్వ జగద్గణ పూజితగాత్రీ
సమరస భావిత వీక్షణ నేత్రీ
రుషిగణ మునిజన మానసపుత్రీ
జయహో జయహో భారతధాత్రీ
జయ జయ జయహో సుందరగాత్రీ
తుషార శైలా కిరీటధారీ
సుందర గంగా కంఠ సుహారీ
పుణ్యనదీ నద మేఖల ధారీ
విశాల వింధ్యా ఘన పయోధరీ
।।జయహో।।
కాశ్మీరం నీ తిలకపు హొయలు
సింధూ శాఖలు నీ శిఖ పాయలు
హరితవనాలే పట్టు చెరగులు
ఝరీ రవాలే నీ చిరునగవులు
।।జయహో।।
ఇరు పార్శ్వముల ఇరు సంద్రాలు
చల్లగ వీవెన వీయుచుండగా
హిందూ సంద్రము పదపద్మాలను
మెల్లగ మెత్తగ ఒత్తుచుండుగా
।।జయహో।।
పుణ్యభూమివి కర్మభూమివి
పుణ్యమూర్తుల కన్న పుడమివి
అవతారాలను అవధరించితివి
ఆత్మత్యాగుల నందించితివి
।।జయహో।।
భిన్నజనాలు భిన్నమతాలు
భిన్న భాషలు భిన్నయాసలు
భిన్నత్వంలో ఏకత్వము
ఏకత్వంలో భిన్నత్వము
ఇదీ నీ సుందర తత్త్వమే
అది మాకందిన వారసత్వమే
జయహో! జయహో! భారతధాత్రీ!
జయ జయ జయహో! సుందరగాత్రీ!