గడ్డివాము యనకాల...

  • 776 Views
  • 0Likes

    సడ్లపల్లె చిదంబరరెడ్డి

  • హిందూపురం, అనంతపురం జిల్లా.
  • 9440073636
సడ్లపల్లె చిదంబరరెడ్డి

ఆడమనిషికి ఆడదే శత్తురువంట!!
నేనంటే మా వదినెమ్మకి కడుప్మంట!!
ఒగరి ఆనందము ఇంగొగరి కంట్లో కొరివి కారమంట!!
ఆ ‘‘మారి’’ మా ఇంట్లో అడుగు పెడుతూనే...
కుర్రదూడల జతలో ఎగురుకొంట, దుముక్కొంట
వంకల్లో, సేనుల్లో వయ్యారంగా ఆడుకొంట
కాలము గడుపుతావుంటే ఆవు పడ్డకి
ముక్కుతాడు బిగదీసి గూటానికి కట్టేసినట్ల,
నడుముకు గుదిబండ తగిలించి మూల్లో కుదేసినట్ల- నన్ను
ఇంట్నుండి కదలకుండ కట్టుదిట్టం సేశ!!
ఏం జేస్తాం??!!
గాచారం బాగలేనపుడు గమ్మనుండల్లని - అంగలారుస్తావుంటె;
ఆ పొద్దు మట్ట మద్యాన్నము- శక్కదువ్వాని సేతికి తీసుకోని
‘‘ముద్ద ఆరిపోతుంది. తట్లో ఏసుకోని గతుకు!
పక్కింటి పాపక్క తావ పేన్లు కుక్కిచ్చుకోనొస్తా’’ అని
సరసర్న బయటికెళ్లిపాయ వదినె.
తట్టలోకి ముద్దయితే ఏసుకొంటిగానీ - తినబుద్ది కాలేదు!
జతగాళ్లతో కలిసి గుంపుగా కూకోని
ఒగర్దొగరు గుంజుకోని, రుసిగా ఉండేవి నంజుకోని
నగుకొంట, నగిచ్చుకొంట- తిండి తినిందంతా నెనపుకొచ్చె!
‘‘నా కొగదానికి మాత్రమే గురుతుకొస్తే ఏం లాబము?
ఎదుటోళ్లకి గూడా ఉండల్ల గదా!!’’ అని నిట్టూరుస్తావుంటే
వామిలో మేకపిల్లలు బెదిరినట్లాయ!!
‘‘దొంగ గొడ్లు దూరినట్లుండాయి’’ - అని
దొడ్డివాకిలి సరుక్కున తీస్తిని గదా..!!
నా కండ్లని నేనే నమ్మబుద్ది కాలేదు!
ఆకాశంలో నల్లగా అడ్డమొచ్చిన మబ్బు గోడల్ని దాటుకోని,
‘ఎలుగుల శందమామ’ కలువపూల దగ్గరికి 
దడుం నదుమికినట్ల
నాకి నాలుగడుగుల దూరంలో నా కలల జతగాడు!!
కండ్లనిండా ఆకలి సూపుల కత్తులు నూరు కొంట
ఆబగా లగెత్తుకొచ్చిన అడవిదున్న మాదిరీ..!!
వాన్ని సూస్తూనే నాకి కాళ్లూసేతులూ ఆడ్లేదు.
పున్నమి రాతిరి ఒళ్లంతా యిరగబూసిన మందారం సెట్టు
సలిగాలికి కదివేకి శాతగాక 
రెమ్మలన్నీ బిగుసుకొని నిలబడినట్లయి,
వాని దూకుడుకు బెదిరి ‘అదికాదిదికాదు’ అనే 
నా నోటిని వాన్నోటితోనే మెత్తగా మూసిపెట్టి
మోపుగట్టెన తీపి సెరకు ననలకట్ట లెక్కన నన్ను
గడ్డివామి యనక్కి ఎదురుకు పాయ!!
‘ఇక్కడొద్దు, అక్కడొద్దు’ అని పీకులాడ్తా ఉన్నట్లే - ఎవరో
గడ్డిలో దాసిపెట్టిన మామిడి కాయలు
బాగా పండబారినట్లుండివి
‘తపతపా’ అని మా ఇద్దరి మద్యాకి సిక్కి పికిలిపాయ!!
యచ్చగా ఉండు నా ఒంటికి
సల్లగా ఉండే కాయలు తగిలి
నరాలు జివ్వుజివ్వున ఆనందరాగం మీటె!!
సుక్కలు సుక్కల తీపికాయల రసం
నా రెండు పెదాల మీదికి జార్తావుంటే?
దప్పికతో ఎండిన నా నోట్లో ఎవరో
తడిని బంగారు దారల మాదిరీ పిండినట్లాయ!
మా ఒళ్లు -
ఒగదాని కొకటి మెత్తుకోని
మాగిన పండ్ల గుబాళింపుల్తో నిండిపాయ!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత