మనిషి ఎంత మంచివాడో

  • 31 Views
  • 0Likes

    ఎర్రాప్రగడ రామమూర్తి

  • విశ్రాంత ఉపాధ్యాయుడు
  • ఖమ్మం
  • 9959352900
ఎర్రాప్రగడ రామమూర్తి

వేదవదనుడయిన నెదురీదలేని
కాలవాహిని కెరటాల వాలులోన
మట్టిలో పుట్టి, మట్టిలో గిట్టు మనిషి
ఎంత మంచివాడో చెప్పనెవరితరము?
దేశము, సంప్రదాయములు, దేహము రంగులు, వేషభాషలున్‌
రాశుల వేరు వేరయి పరస్పర ధిక్కృతి రీతి తోచినన్‌
శైశవమాది జీవిత దశావిభవంబులు, మోదవేదనా
క్రోశ శతాది భావనలకున్‌ తలి వేరొకటే వసుంధరన్‌.
ఇందలి మూలసూత్రము గ్రహించి తపించి మహామనీషియై
అందని ఎత్తుచేరి వసుధైక కుటుంబ పదంబులంబరం
బందు ప్రతిధ్వనింపగ స్వరార్చన చేయుట లోక శాంతికెం
దెందున చూచినన్‌ మనిషికే ధర చెల్లు నుదార మూర్తికిన్‌.
మనిషే మత్తిలి, నెత్తురున్‌ మరగి, దుర్మార్గాలలో వండి వా
ర్చిన దైత్యాత్మక భావనల్‌ మతపిశాచీ భూత బేతాళ డా
కినులై భూతలమెల్ల సంకటములన్‌ గీలించి లంకింపవ
చ్చని నర్తించు జిహాద్నినాదములతో నాత్మాహుతి జ్వాలలన్‌
వరదలో కొంపలంటించువాడు మనిషె
వరదుడై వచ్చి ఆర్పెడు వాడు వాడె
క్షణములో ప్రాణములు తీయు ఘనుడు వాడె
కడగి ప్రాణము పోయు వైద్యుడును వాడె
తాలిమికే జయంబనుచు ధర్మము వీడని వాడు, రాజకీ
యాలకు మిత్ర శాత్రవ పదార్థము నిత్యము కాదటంచు ద్వం
ద్వాల కధీనుడై ప్రవచనాల్‌ కురియించెడువాడు నొక్కటే
పోలికతోచు పైపయిన, బుద్ధులు మాత్రము వేరువేరయా!
పుట్టుటయందునన్‌ సుజనపూర్ణసమాజ సమత్వమందునన్‌
గిట్టుటయందునన్‌ మతము గీరల గారలు లేవు, మధ్యలో
కట్టెకు పుట్టిపేరిన నిగారపు మచ్చలు రాచపుండు చూ
పెట్టెడు దుర్నిమిత్తములు భీకర భగ్నచితాగ్ని భిత్తముల్‌
చెడ్డయన్నది లేనట్టి గడ్డ మీద
కొంచెమైన విలువరాదు మంచికనుచు
మొదటి దానికి తలవంచి మొక్కువాడు
మనిషి, ఎంచగా వాడెంత మంచివాడొ!
ఈతనువెల్ల దేశమునకేను సమర్పణసేసియుంటి, నీ 
నా తన భేదముల్‌ కలుగునా కలనైన నటంచు స్వోదరా
ఖాతము నింపగా ప్రజల కాసులు మింగుట ఎంత కష్టమో
సేతువు శీతశైలమును స్విస్సున దాచెడు వాడు చెప్పడో!
మనుషుల అంతరంగమున మాధవుడుండును హస్తకల్పుడై
అనునది నిక్కమే అయిన అబ్బురమే పరమాత్ముడే యతం
డనుట? ధరాతలాన నసురారి అహంతయు హంతకుండునౌ!
తనరగ తవ్వితీయవలె తట్టెడు బుట్టెడు ధర్మసూక్ష్మముల్‌.
గుప్పెడు మందితో చెలగి గొప్పలు గుప్పుచు రాక్షసోద్ధతిన్‌
చెప్పుటకే మనుష్యులన చెల్లిన ఘాతుక పాతకాంధసుల్‌
ముప్పుగ దాపురించునెడ ముఖ్య సమాఖ్యలు నోటుమాటకే
మప్పితమైనచో పుడమి మంచితనంబది యెల్ల భస్మమౌ!

 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఉగాది

ఉగాది

నారాయణమూర్తి తాతా


వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః

కంచనపల్లి ద్వారకనాథ్‌


సంభ్రమం

సంభ్రమం

కళ్యాణదుర్గం స్వర్ణలత


సిలువ పలుకులు

సిలువ పలుకులు

పచ్చా పెంచలయ్య


అమ్మ కట్టిన మొలతాడు

అమ్మ కట్టిన మొలతాడు

గాజుల పవన్‌కుమార్‌


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌