నేను

  • 273 Views
  • 0Likes

    దండమూడి శ్రీచరణ్‌

  • భువనగిరి, నల్గొండ.
  • 9866188266

దేహం నేను, దాహం నేను
మేఘావృత సందేహం నేను
ఖడ్గం నేను, యుద్ధం నేను
ఖడ్గ చాలన కౌశలం నేను
నేను విసిరిన ప్రశ్నల పరంపరకు
కుత్తుక తెగిన సమాధానం కూడా నేను
స్నేహం నేను, ద్రోహం నేను
మానవ సంబంధ సందోహం నేను
వేదం నేను, భేదం నేను
యజ్ఞవాటికన హవిస్సు నేను
నేను ఎగిసిన నభస్సు సభన
ప్రభవించిన ప్రచండ తేజం నేను
తెగిపడిన ఏకలవ్యుడి బొటన వేలిలో
తలవంచని వీరత్వం నేను
సీల ఊడిన కర్ణుడి రథచక్రాన
పోరుకు వెరవని శూరత్వం నేను
నేనొక సేద్యం, నాదొక వైద్యం
నా హృది నెత్తుటి పూజా పుష్పం
నేనొక అశ్వం, నాదొక స్వప్నం
నా గుడి వాకిట గంటా శబ్దం
నేను నడిచిన నట్టడవుల తోవల
మిన్నాగులూ, మణిమాణిక్యాలూ
నేను చూసిన మస్తిష్క కుహరాన
చీకటి నీడలు, చీడలు, పీడలు
ఒకరినొకరు హత్తుకుపోతూ
ఒకరి కుత్తుకలొకరు కోస్తూ
ఒకరికొకరు అత్తరు పూస్తూ
ఒకరి నెత్తురు ఒకరు చూస్తూ
మానవ దానవ సంగర రంగాన
మానవత్వపు తుదికేళి హననాన
భగవద్గీతలు, భక్తి రాతలు
నుదుటి గీతలు మార్చని క్షణాన
నేనిలా మిగిలా జీవన చదరంగాన
రాజులు, శకటులు, రాణి, బంటులూ
మంత్రతంత్రాలు, శక్తులు, కుయుక్తులు
రాక్షస క్రీడలు సలిపే రణాన
ఏది ధర్మం? ఏది అధర్మం? 
ఏది న్యాయం? ఏది అన్యాయం? 
ప్రశ్నకు పుట్టే ప్రశ్నను నేను
కర్మకు పుట్టే జన్మను నేను
జన్మను దిద్దే కర్మను నేను
సత్కర్మను నేను!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


స్నేహవారధి

స్నేహవారధి

గొడవర్తి శ్రీనివాస్‌


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


విసిరేసిన కాలం

విసిరేసిన కాలం

జస్టిస్‌ దామ శేషాద్రినాయుడు


దృశ్యాదృశ్యం

దృశ్యాదృశ్యం

కొప్ప‌ర్తి వ‌సుంధ‌ర‌


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు