తూర్పు ముఖానికి ఎర్రబొట్టు పెట్టిన
‘‘పడుచుపల్లె’’
ప్రపంచీకరణ విషపు కౌగిలిలో
కరిగి ఉడిగిపోయింది
రోజూ సూర్యుణ్ని ప్రసవించే
చెరువు ఎండిపోయింది
ఏట్లో కాలుష్యం
మనసులలోకి పాకింది
నాగలి నాట్యానికి నవ్వే నేలని
రియలెస్టేట్ ఆబోతులు
‘‘మేసేసాయి’’
ఉత్తరాన చింతతోపుకి
సెజ్ పురుగు కుట్టింది
ఇక్కడ
మనిషి వాసన వచ్చే మట్టి గోడలు
స్వార్ధపు వరదలో కొట్టుకుపోయాయి
ఇప్పుడన్నీ గట్టిగోడలు
పరాయి మనుషులే కాదు
మనసులూ రాలేవు
ఒకడి గొండెకోతకు
ఊరంతా పొగిలి ఏడ్చిన పల్లె
ఇప్పుడు రాజకీయ జెండాల కింద
చీల్చబడింది
పాలిచ్చిపెంచిన పట్నం
ఇప్పుడు పల్లెని పాలిస్తోంది
ఉన్నవన్నీ ఊడ్చిపెట్టాక
పల్లె మనుషులను
ఎగుమతి చేస్తోంది
ఇక్కడ పట్నానికి కలిపే
దారులన్నీ ‘‘వన్ వే’’లు
ఇప్పుడది పల్లె కాదు
‘‘విలేజ్’’
ఇప్పుడొక నిర్మాణం కావాలి
మనిషి నిలబడాలి
పల్లె నిర్మించబడాలి