అక్షరాశ్రమం

  • 48 Views
  • 0Likes

    బీవీవీ ప్రసాద్

  • తణుకు, ప.గో.
  • 9032075415

సముద్రంపై ఎగిరి ఎగిరి మళ్లీ నౌకపైనే వాలిన పక్షిలా
లోకమంతా తిరిగి మళ్లీ అక్షరాలపై వాలతావు
నీ కెంతమేలు చేస్తున్నాయో ఎపుడూ గమనించలేదు కాని
భూమ్మీద అక్షరాలు మినహా నీకు తోడెవరూ ఉన్నట్టులేరు
దుఃఖంలోకీ, వెలితిలోకీ, ఘనీభవించినపుడు
ఏ శూన్యం నుంచో పుట్టుకొచ్చిన కిరణాల్లా అక్షరాలు
నీ ఉద్విగ్న హృదయాన్ని చేరి మెల్లగా నిన్ను కరిగిస్తాయి
ఇంత దయా, శాంతీ నీ అక్షరాలకెలా సాధ్యమని
మిత్రులు విస్మయపడుతున్నప్పుడు ఆలోచించలేదు కానీ
వాటిని ఆశ్రయించే క్షణాల్లో ఏదో దివ్యత్వం
నీ దుఃఖాన్ని దయగా, వెలితిని శాంతిగా పరిపక్వం చేస్తున్నట్లుంది
ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఒక్కొక్క అద్దంలా కనిపిస్తోంది
అద్దాలని అతికినప్పుడల్లా
నీ లోపల ముక్కలైనదేదో అతుక్కొన్న ఊరట కలుగుతోంది
ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ నక్షత్రంలా కనిపిస్తోంది
కాసిని నక్షత్రాలని పోగేసుకొన్న ప్రతిసారి
పిపీలికంలా మసలే నువ్వు పాలపుంత వవుతున్నట్లుంది
ఇప్పుడు ఒక్కొక్క అక్షరమూ ఓ కన్నీటి బిందువవుతోంది
కాసిని కన్నీళ్లని జారవిడిచిన ప్రతిసారీ
గర్వమో, స్వార్థమో, మరో చీకటో కరిగి
మామూలు మనిషి దేవుడవుతున్నట్లుంది
జీవితం ప్రార్థనా గీతమవుతున్నట్లుంది
ఎన్నటికీ మరణించనిదేదో లోలోపల వెలుగుతున్నట్లుంది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి