నింగిమీద నిలబడి
సంగీతాన్ని ఆస్వాదించటం
సూర్యునికేం తెల్సు
చంద్రునికే తెల్సు
వెన్నెలే కదా
ప్రేమించేది ప్రేమ పంచేది
ఇప్పుడు ప్రేమ కావాలి
బండరాళ్ల మధ్య
సంగీతాన్ని ఆలపించటం
ఇప్పుడు తప్పని గీతం కావాలి
ఇప్పుడు ఆత్మీయత ఓ సంగీతం కావాలి
గుండెలు కొండలయిన వేళ
కర్కశత్వం రాజ్యమేలుతున్న సమయాన
చిరుగాలి గీతం రావాలి
ఇప్పుడు మమత ఓ రాగం కావాలి
అరణ్యాలు నడిచి వచ్చి
నగరం మధ్య బస చేసిన వేళ
ఓ నెమలి నాట్యం కావాలి
ఇప్పుడు మనసు వికసించాలి
మల్లెపూలు ఇంటి ద్వారం ముందు వేలాడాలి