కొసరి కొసరి కొత్త కోర్కెలకు
కుసుమ పేశల నవతారుణ్యాశలకు
అమందానంద రసతుందిల నందనాలకు
చిరకాలం సంకేతం
ముద్దబంతి!
పరంపరాది పురోభివృద్ధికి
కళకళలాడే వంశాంకురాలకు
వికసిత హర్షామోద ప్రమోదాలకు
తరతరాల చిరునామా
ముద్దబంతి!
పసుపు పెట్టిన
కొత్త బట్టలక్కరలేదు
పంచభక్ష్యాలక్కరలేదు
బంధుమిత్ర జనగణాలవసరమే లేదు
ముద్దబంతులను మురిపెంగా
ముంగిట కూర్చు!
కళకళలాడే తుహినార్ద్ర హరిద్రశోభతో
అంతులేని పండుగ సంబరం ఆరంభమవుతుంది!
బతుకమ్మ ఇంటి ముంగిట కొలువుంటుంది
ఇల్లు హరివాసమవుతుంది.