ఇన్నాళ్ల తరువాత మళ్లీ బడిని చూస్తూ...
మురిసిపోయిన నా మనసు యూనిఫాం తొడుక్కుంది.
బడిముందిలా నిలబడి కాలం కళ్లలోకి
తొంగిచూస్తూ... గతాన్ని నోటు పుస్తకంలోని పేజీల్లా
వెనక్కి తిప్పుకున్నాను...
మదిని మడతపెట్టి... కాగితపు రాకెట్లా మార్చి
గురిచూసి బడిగోడల మధ్యకి విసురుకున్నాను.
నాకు తెలీకుండానే బడికి... గుండెల్లో
కట్టుకున్నట్టున్నానొక బంగారు గుడిని.
గర్భగుడిలో ఘడియకో రూపాన్ని మార్చే
మూలవిరాట్టులా... హృదిలో కదులుతోన్న గురుదేవుళ్లు.
స్తుతించడం మొదలుపెడితే... అయిపోతుంది అష్టోత్తరం.
చేతులెత్తి నమస్కరించినందుకే...
చక్కని జీవితాన్ని ప్రసాదించిన దేవాలయం ఇది.
బడి, నా బాల్యానికి గుర్తుగా మిగిలిన మినీ తాజ్మహలే!
ఆటపాటలలో మునిగి తేలినప్పుడు అంతగా అర్థమవలేదు గానీ
ఆటుపోట్లనెదుర్కొనేందుకు రాటుదేల్చిన బాట ఇదే.
కలసిమెలసి తిరిగినప్పుడు అనుకోలేదు గానీ...
సహజీవనాన్ని నేర్పిన సహజ జీవన వనం ఇది.
ఈ నల్లబల్ల సాక్షాత్తూ... సారవంతమైన
చదువుల పంట పండించిన నల్లరేగడి నేలే!
ఇక్కడ నాటిన విత్తనాలే కద ఇప్పటికీ...
గుండె లోతుల్లో వటవృక్షాలై
శాఖోపశాఖలుగా విస్తరిస్తోన్నది.
ఈ బడిగోడల మధ్యన మరోసారి కూర్చొని...
మౌనంగా గతాన్ని పాఠంలా మళ్లీమళ్లీ చదువుకుంటాను...
తప్పులని దిద్దుకుని... తలెత్తుకు మనిషిలా...
మళ్లీ... నడక మొదలుపెడతాను!
మిమ్మల్ని మీరు మార్చుకోవాలని అనుకుంటే... మిత్రులారా...
ఒక్కసారి మీ బడికి వెళ్లిరండి.