మట్టిలో ఆశగా పెట్టిన విత్తనం
చైతన్యాన్ని ప్రాభవించుకొని
మృదువుగా నర్మగర్భంగా మొలకెత్తే దశ..
ఎంత అద్భుత దృశ్యం
ఉర్వి తన ఉపరితల నివాసిత మానవాళికిచ్చే
వంశపారంపర్య సందేశం
తాను జీవించి, జీవింపజేసే దిశగా
ఒక బీజం
మొక్కగా రూపాంతరం చెందడమూ
ప్రకృతి సౌందర్యానికి ఓ అమోఘ దృష్టాంతం
తేమ, వేడి, పోషకాలు, వెలుతురు..అన్నీ
పుణికిపుచ్చుకోవడం సహజ లక్షణం
విత్తనం నుంచి చిన్న వేరు ఆవిర్భవించి
మొలక కొమ్మయై పైకి ఎదగడం
కిరణజన్య సంయోగక్రియతో
మళ్ళీ అంకురోత్పత్తి.. ప్రకృతి వలయం
పచ్చదనాన్ని పొందడం,
పత్రాలుగా, పువ్వులుగా, ఫలాలుగా
సంభోజనాన్ని అందించడం
ఇది వాస్తవిక దైవిక ప్రకృతి
కానీ, కొంతమంది మనుషుల
ఆలోచనల భూతాలు
వికృతంగా ప్రకృతిపై ఆకృత్యం చేస్తూ
వృక్ష దేహాల్ని గాయపరుస్తుంటే
ప్రకృతి పత్రహరితాన్ని చిదిమేస్తుంటే
పెక్కు పరిశ్రమల కాలుష్య ఉద్గారాల్ని వెడలిస్తున్నా,
పర్యావరణం మనిషి రక్షణకై
తన శాయశక్తులా దోహదపడుతోంది
ఉద్గారాలనీ, వ్యర్థాలనీ సహిస్తూ..
నిండైన ప్రేమను ప్రపంచానికి పంచే విశిష్ట అమ్మ..
అటువంటి భూమాతకో ప్రేమ ముద్దు