వర్షానికి ప్రేమలేఖ

  • 241 Views
  • 3Likes

    వెంకటేష్‌ పువ్వాడ

  • ప్రకాశం జిల్లా.
  • 9743271569

ఒక ఉష్ణ ధామ హృదయం 
ఊసులు బాసలు ఉడుకుతున్న సాయంవేళ
దేహమంతా పగుళ్లు
ఉచ్వాశ నిశ్వాసాల నిండా వియోగ గీతం
పశ్చిమ మలయమారుత వింజామరల
హాయి లాలనలో
లోలనమై ఊగుతున్న
క్షణాన ఒక కణాన
సంధ్యతో సంధి కుదిరింది
కుదరక ఏం చేస్తుంది 
ఇద్దరి రందీ ఒకటే మరి!
అల గడ్డిపోచల మెత్తపై వొళ్ళు వాల్చి
కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నా
మబ్బుల పందిరికేసి
మరో ఉదయం కోసం కాదు
వాన కోసం
నా చినుకుల చిన్నదాని కోసం
అవును నీ కోసమే చూస్తున్నా
నువ్వు తెచ్చే మట్టి పరిమళాల
శ్వాస కోసం నేలకి సాగిలపడి
యవ్వన వసంత ఉద్రేకంతో ఎదురు చూస్తున్నా
నా పాటకీ, మాటకీ సాకీ నువ్వే సఖీ!
ఓసారి వచ్చిపో చెలీ!

నీకోసమే చూస్తున్నా
ఇంద్రధనుస్సు అంచు నీలిచీరలో
వడబోసిన అందాలన్నీ కుండపోత
వలకపోతలో వనాల జలకాలాటలలో
తడిసిన చెట్టు ముంగురుల
స్పర్శ కోసమే ఈ విరహ వేదన
నువ్వొస్తావని కృష్ణానది ఒడ్డున
గవ్వల మువ్వల్ని కువ్వలుగా
కానుక చేసి ఇవ్వాలని
ఓసారి వచ్చిపో చెలీ!

నీకోసమే చూస్తున్నా
మెరుపుల విరుపుల ఫెళఫెళల
అందెల సప్పుడై నువ్వొస్తే
ఎండిన నాగేటి సాల్లన్నీ
పచ్చల హారాలై పుడమి మెడలోకి
అలంకారమైతే చూడాలని ఉంది
నువ్వొస్తావని పంట కాలువ మలుపులో
మధ్య రాత్రిలో మిణుగురులకి దూరంగా
చలిమంటేసుకు కూర్చున్నా
ఓసారి వచ్చిపో చెలీ!
నీకోసమే చూస్తున్నా
గాలిమామ ఈలల మేళ తాళాలతో
నువ్వొస్తే కిలకిలమని పిచ్చుకలు
పచ్చిక పైకి దూకి రెక్కల్ని రెపరెపలాడిస్తే
చూడాలనివుంది చిత్రం!
నువ్వొస్తావని మా గిజిగాడి ఎండు తీగల
వెండి ప్యాలెస్‌ పైకెక్కి ఎదురుచూస్తున్నా
ఓసారి వచ్చిపో చెలీ!
నీ జడి లేక నేలగర్భం మండుతోంది
నీ మడి లేక
నాన్న ఎండుతున్న పంటకు
కాటికాపరై దిగాలై పోతున్నాడు
నీ తడి లేక వాగులు, వంకలు
నదీ ప్రవాహ దారులు ఇసుక ఎడారులై
ఒట్టి పోతున్నాయి
మా చిన్నోళ్లు చేసిన
కాగితం పడవలు నేలపై దోగాడుతున్నాయి
నువ్వు రాక మనిషి మాయమైపోతున్నాడు
నువ్వు లేక నేను వలస పక్షి నై
బాట లేని బాటసారినై
ఎక్కడికిపోతున్నానో ఎటుపోతున్నానో
తెలియడం లేదు
ఓసారి వచ్చిపో చెలీ!
వేకువలో తెల్ల చీరతో వస్తావో!
సాయం సంధ్యలో 
ఎర్ర చీరలో వస్తావో నీ ఇష్టం
ఒక్కసారి అంబరం వదలి రావే!
నేల సంబరం చూసి పోవే!
నీకోసమే చూస్తున్నా!
ఓసారి వచ్చిపో చెలీ!
ఓసారి వచ్చిపో చెలీ!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పునర్నిర్మాణం

పునర్నిర్మాణం

దోర్నాదుల సిద్దార్థ


మనసుకు మనసుకు మధ్య రహదారి

మనసుకు మనసుకు మధ్య రహదారి

- ఈతకోట సుబ్బారావు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు