పైరగాలి పాటలతో
పులకించే గిరులు..తుళ్లిపడి నవ్వే
తరుల రాగాలు వింటూ
నా ఉదయాలు మేలుకునేవి
హృది కిటికీల నుంచీ
వలపు వాన ఒలిపిరి రాగం
నా నిశ్చలతను నీరవ ఏకాంతాన్ని
భగ్నం చేసేది
రోలు రోకలిని శృతి చేసి
వడ్లను బియ్యపు రూపాంతరం కావిస్తూ
అమ్మ వేసే దరువులు
ఆకలి పొట్టను ఆప్యాయంగా తడిమేవి
ఏ సాయంకాలమో...
సాగర సాంగత్యంలో వినిపించే సరిగమలు
అలుపెరగకుండా పాడే అలల సడులు
నా అంతరంగ తీరాన్ని తాకేవి
జీవప్రపంచంలో
ఆకలి కేకలదో రాగం.. ఆక్రందనలదో రాగం
శ్రమ జీవితాల అడుగడుగునా.. అరుదైన రాగాలు
దేహపు చెట్ల కొమ్మల రేమ్మల గుబుర్లలో
గుండె కోయిల పాడే లయ తప్పని
జీవన రాగాలే..
అసలైన సంగీత సౌరభాలు