ఎప్పుడైనా అతని నుంచి రాలిపడిన
మాటల చిల్లరను
ఏరుకుని దాచుకునేది
మనసైనపుడు
మనసు గుంజకానుకుని
ఊసుల
కాసులమూటను విప్పుకుంటుండేది
ఆ హృదయమిపుడు
మౌనం బాధితురాలు!
నిశ్శబ్దాల
శూన్యపు గుంటలను పూడ్చే
చేతల పలుకులు కావాలి
కంకిపై గువ్వ కిచకిచలాడినట్టు
పైరగాలికి ఆకులు గలగల్లాడినట్టు
పువ్వుల పరాచికాల్లా
పగలంతా పకృతి సందడులు
ఎన్నెన్ని...సంబరాలు!
వాగు నిశ్శబ్దాన్ని నెనపేదెవరు
ఒంటరి నావకు తోడుగా
సముద్రపు హోరు కావాలి గాని!
కొండ మౌనం ఎవరికి మేలు!
కీచురాల్లే నయం!
చీకటిరాత్రిని దాటిస్తాయి భయమెరగకుండా
గుండెగదిలో నిశ్శబ్దం
గుర్రుగా చూసేలా
గోడలు సద్దుచేయడం కావాలి
ఆమెకిపుడు..
ఒకింతసేపు
నిశ్శబ్దం నిద్రించడమే కావాలి!