మణిపూసకు శ్రీకారం
పదకవితల ప్రాకారం
కవితలమ్మ కన్నట్టి
కలలన్నీ సాకారం!!
అమ్మ మనసు నెరుగవోయి
ఆత్మీయత చూపవోయి
ఆమె కన్నీరుపెడితే
నీ బతుకే బండరాయి!!
ఎవరికి చేదోయి డబ్బు
మందు దొరకనిదీ జబ్బు
వ్యామోహం వీడితివా
తొలగునింక మాయ మబ్బు!!
మనిషికి మనిషికి మధ్య
మానవత్వమే మిథ్య
చరవాణికి బానిసలై
మరచిరి మాటల విద్య!!