వేపచెట్టు నీడలో

  • 337 Views
  • 6Likes

    తంగెళ్ల రాజగోపాల్‌

  • అమలాపురం.
  • 8639536092

నాన్నెప్పుడూ ఇంతే
మహా పిసినారి!
నాకైతే పట్టు జుబ్బా కుట్టించి మురిసిపోతాడు
తానేమో తూకానికి తానుముక్కలు కొనుక్కుంటాడు
నాకైతే అరకాసుతో ఉంగరం చేయించాడు
తను మాత్రం వెండి బిళ్లకి 
మొలతాడు కట్టి మెళ్లో వేసుకుంటాడు
మాకు జ్వరమొస్తే
డాక్టరు దగ్గర చీటీ పుచ్చుకుని 
ఆటో పిలుచుకొస్తాడు
తనకి ఒళ్లు కాలుతుంటే మాత్రం
సైకిలేసుకెళ్లి మందు బిళ్ల తెచ్చుకుంటాడు
నేను కాలేజీకెళతానంటే కొత్తబండి కొనిపెట్టాడు
తనింకా ఆ పాత సైకిలే తొక్కుతున్నాడు
గుండెల్లో ఉన్న ప్రేమని పంచేస్తే
కొడుకులు దుబారా చేసేస్తారని
పదిలంగా తనలోనే దాచుకున్న
అసలు సిసలు పిసినారి నాన్న!
అన్నిట్లో పిసినారి అయిన నాన్న
కోపం మాత్రం సులువుగా ఖర్చుపెట్టేస్తాడు!
అదేంటో మరి..
అందుకేనేమో..
తియ్యగా మాట్లాడ్డం తెలియని నాన్న
నాకు వేపచెట్టులా కనిపిస్తాడు!
అది కూడా ఇంతే..
దాని నీడ చల్లన, గాలి సాంత్వన
ఆకు ఔషధం, కలప శ్రేష్ఠం
అయినా సరే ‘చేదు’ అని చెడ్డపేరు
అచ్చం నాన్నలాగే!
మా రేపటి కోసం తన యవ్వనాన్ని ఈఎంఐగా కట్టేశాడు
ఇంకా కడుతూనే ఉన్నాడు
రిటైర్మెంటు లేని ఉద్యోగంలో చేరడమే కదా 
నాన్నవడమంటే
అసలు ఒక్కోసారి నాన్ననే అడగాలనిపిస్తుంది
‘నాన్న కాక మునుపు నువ్వు ఎలా ఉండేవాడివి నాన్నా’ అని
ముప్పై ఏళ్లుగా ఈ పాత్రలో ఒదిగిపోయిన నాన్న
ఇది ఒక పాత్రే అని మరచిపోయాడు పాపం!
వయసొస్తోంది కదా...
నాన్న ఎప్పటికీ ఇలాగే ఉంటాడనుకున్న నాకు
కాలం పరుగుకి ఆయన వేగం తగ్గడం చూస్తుంటే
నా కాళ్లకింద నేలని ఎవరో లాగుతున్నట్టనిపిస్తుంది
అటూ ఇటూ ఊగే సింపుల్‌ పెండ్యులంలాగా
తిరగలి రాళ్ల మధ్య నలుగుతున్న ఆవగింజలాగా
నిన్నటి తరం బాధ్యతల్నీ, రేపటి తరం కలల్నీ
మౌనంగా మోసే నాన్న భుజాలు
అందుకేనేమో, ఎప్పుడూ వంగే ఉంటాయి
నాన్న మోసే బరువెంతో..
బహుశా, నాన్నైతే తప్ప నాకు తెలియదనుకుంటా
అందుకే, నాన్నని ఓసారి చంటిపిల్లాణ్ని చేసి
ఎత్తుకోవాలనిపిస్తుంది!
ఎత్తుకుని గుండెలకి హత్తుకోవాలనిపిస్తుంది!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కృష్ణం వందే!!

కృష్ణం వందే!!

పేరిశెట్ల శివకుమార్


రీస్టోర్‌ చేసుకోవాలి

రీస్టోర్‌ చేసుకోవాలి

దాసరి చంద్రయ్య


మెతుకు

మెతుకు

- ఈతకోట సుబ్బారావు


చెమర్చిన కళ్లు

చెమర్చిన కళ్లు

గంజాం భ్రమరాంబ


ఇక మౌనం నా వల్లకాదు

ఇక మౌనం నా వల్లకాదు

సుసర్ల జయభారతి


ఆటలాడు భాష మాటలాడు

ఆటలాడు భాష మాటలాడు

జాగాన సింహాచలం