ఈ రాయిని వెతికి ఏ శిల్పీ
శిల్పం చెయ్యలేదు
ఈ రాయిని చదును చేసి ఏ మేస్త్రీ
మేడ ఎక్కేందుకు మెట్టుగా కట్టలేదు
ఈ రాయిని బోర్లించి ఏ తోటమాలీ
విశ్రాంతి బల్లగా మార్చలేదు
నాలుగు మూలలు చౌకం చేసి
ఈ రాయిని ఏ వడ్డెర కూలీ
భవనానికి పునాది రాయిగా ఉపయోగించలేదు
వాహనాలు సాఫీగా, వేగంగా వెళ్లే
రహదారి మీద అన్నివైపులా మొనలు తేలి
అడ్డంగా పడి ఉన్న బండరాయి ఇది-
కవిత పేరుతో చలామణి అవుతున్న కంకర ఇది-
ఎంతటి ప్రమాదానికైనా హేతువు
ఇది ప్రాణాలు తీసే తీతువు
కళాత్మకంగా కవితా శిల్పమైనా రావాలి
లేదా, సాంకేతిక ఉపయోగ వ్యాసమైనా కావాలి
ఏదీ కానప్పుడు అది ఉట్టి బండే
ఆత్మహత్యల మడుగులు సృష్టించే ప్రక్రియ!
కంకర రాళ్లన్నీ తమను తాము
రూప శిల్పులమని ప్రకటించుకుంటుంటే
అసలు రూపమేదని శిల్పం ప్రశ్నిస్తోంది-
శిలలోంచి ఒక రూపం ప్రవహిస్తేనే శిల్పమవుతుంది
శిలలో ఒక భావం రవళిస్తేనే కళ అవుతుంది
కవితైనా, చిత్రమైనా, నాట్యమైనా, గీతమైనా, సంగీతమైనా
ప్రవాహ గుణం ఉంటేనే ఊపిరి పీలుస్తుంది
నదిలాగా కవిత్వమొక ప్రవాహమైనప్పుడే
దాహం తీరుస్తుంది, తిండి పెడుతుంది, విద్యుత్తునిస్తుంది
తనతోపాటు అత్యాధునిక
నాగరికతలోకి ప్రవహింపజేస్తుంది!
నదిలాగే కవిత కూడా నాగరికతకు చిహ్నం!
మన స్థాయి ఏమిటో మన కవిత తెలియజేస్తుంది
మన స్థానం, మన కాలం, మన ధ్యేయం, మన భాష
వాక్యం వెనక వాక్యమై, కవితాత్మే హృదయమై
కాలాలకు అతీతంగా నిలబడే పద్యమౌతుంది
నదిలాగే కవిత కూడా నాగరికతకు చిహ్నం
శిల్పంలాగే కవిత కూడా నిలబడే చరిత్ర
సంస్కృతి వలె కవిత కూడా వ్యక్తీకరించుకునే భూగోళం
మనమేమిటో, మనస్థాయి ఏమిటో
మన కవిత తెలియజేస్తుంది