చీకట్లను పారదోలుతూ
వెలుతుర్ని వెదజల్లుతున్నది దీపం!
ఆవిరైపోయిన చమురు
కాలి బూడిదైపోయిన ఒత్తి
తర్వాత ఎటూ కనబడవు!!
ఆ క్షణం మొలకెత్తిన వెలుతురు కిరణాల్లోంచి
పత్రంపై లిఖించుకున్న అక్షరాలు
కొన్ని మెదళ్లలోకి చొరబడి
మెరుపుల సుడులుగా పదిలమవుతాయి!!
ఆలయంలో దేవుడి ప్రతిమ అభయమిస్తున్నట్లు-
అక్షర కిరణాలు లక్షల కణాలై
ఉద్యోగ జీవనానికి బాటలు వేస్తాయి!
ఎదుగుదల, తరుగుదల తాసులో
ఆర్థిక సూచి నుంచి బంధీ విముక్తుడిని చేసేందుకు
అక్షరం-
‘లక్ష’ణంగా మన జేబుల్లోకొచ్చి
ఒదిగి కూర్చుంటుంది!
ఎక్కడో ఉన్నాడంటున్న దేవుడి కోసం
వెదుకులాడుతూ-
ఎదురుగా ఉన్న అక్షరాన్ని ఆవాహనం చేసుకోలేక...
ఎక్కడో నేర్చిన తంత్ర విద్యలతో
అభివృద్ధి మంత్రాన్ని చేరుకోలేక...
అక్షరం-
మరింత మెరుగులు దిద్దుకుని మెరిసేందుకు
అక్షరాభ్యాసం చేస్తోంది.