నట్టింట్లో తనో మహా సముద్రం
అలల చేతుల్తో కౌగిలిస్తుంది..
అంబరాన్నంటే సంబరాల్లో ముంచేస్తుంది..
ఆ నీలాల కళ్లల్లో ఎన్ని కలల నక్షత్రాలో?
ఎన్ని మెరుపులో...
మరెన్ని తళుకులో?
ఒక్కసారి తేరిపారా చూస్తే చాలు
ఒళ్లంతా పులకింతల పాలపుంతలు వేనవేలు
గులాబీరేకుల్లాంటి ఎర్రెర్రని పెదాల్తో
తను చిర్నవ్వులు చిందిస్తే
ఎన్ని పర్వాలో... నేత్రపర్వాలో?
ఉంగాఉంగా ఊసులు...
లిపిలేని చిలిపి చిలిపి బాసలు
అప్పుడప్పుడూ
సరిగమలెరుగని సంగీత కచేరి
అడపాదడపా
గమకాలెరుగని గీతాల ఝరి
ముద్దులూ మురిపాలతో సరి
అరుపులు, కేకలూ కిలికించితాలు
ఔను మరి...
తనుంటే ఇల్లంతా నందివర్ధనాలు!
ఏ దివ్యలోకాల నుంచి పారిజాతాలను ఏరికోరి తెచ్చిందో తను..
ఏడాదంతా పరిమళాల తుపాను..
పరవశాల సునామీ..
తను నిద్రపోతే క్షణకాలం కదలదు..
లేస్తే ఇరవైనాలుగ్గంటల సమయం చాలదు..
అనుక్షణం అలుపెరుగని ఉరుకులు పరుగులే..
కుదురుగా ఉండటం తనకు కుదరదంటే కుదరదు!
గది నాలుగు చెరగులా గలగలా గంగలా ప్రవహిస్తూనే ఉంటుంది..
కష్టాలు, నష్టాలు, దైనందిన దుఃఖాలు
వేదనలు, రోదనలూ...
అన్నీ తనని చూస్తే మటుమాయం!
ఒక్కసారి చటుక్కున ఎత్తుకుని
హృదయానికి హత్తుకుని
మనసారా ముద్దాడితే...
చొంగకారుస్తూ మనసంతా తడిపేస్తుంది.
అప్పుడు... ఆ క్షణంలో మా ఇంట్లో
గంగాతీరంలోని కుంభమేళ!
మా గుండెల్నిండా
గోదారి పుష్కర జాతరహేల!!