మబ్బుల అంచుల్ని తాకి
తన్మయత్వంతో ముద్దాడి
గ్రహాంతరవాసుల్లా తేలిపోయేటోల్లు
ఆకాశహర్మ్యాల్లోని మహా కుబేరులు!
పాదాల కింది మట్టిలో
నలిగే పాతాళ లోకులు
ఆకాశహర్మ్యాల్ని కట్టే
అవిశ్రాంత శ్రామికులు!
నేలపై నిలబడి
మేఘాల్ని తాకాలని
కలలు కనే మధ్య తరగతోల్లు
ఎటూ కాని త్రిశంకుస్వర్గవాసులు!
నిశి ఉంటేనే కదా
శశి సుందర మెరుపులు!
చెమట చుక్కలుంటేనే కదా
ఏడంతస్తుల మేడల ధగధగలు!!
కళ్ల ముందు సాక్షాత్కారం
అందమైన అద్దాల మేడలు
కనిపించవు కదా ఎపుడూ
గోడలో ఊపిరాడక నలిగే ఇటుకలు!
పెకలవు కదా ఎపుడూ
కూరుకుపోయిన గొంతులు
నింగిని నేలనూ మోస్తూనే
అలసి సొలసిన బతుకులు!
సిగరెట్టుకు అగ్గిపెట్టి
పొగ పీల్చే ప్రబుద్ధులు
అభాగ్యుల్ని కసితో పిండి
సంపదల తేనెను సేకరించేటోల్లు!
మనుషులంతా ఒకటి కాదు
ప్రజాస్వామ్యం ఓ ఎండమావి
సమానత్వం ఎక్కడుందీ..
కరోనా కర్కశ కళ్లల్లో తప్ప!