పచ్చల పతకమే చెట్టు

  • 168 Views
  • 0Likes

    కమలేశ్‌


పచ్చని చెట్టును చూస్తే నాకు
వరమివ్వడానికి ప్రత్యక్షమైన
దేవతలా కనిపిస్తుంది..
నీడనిచ్చే కొమ్మలు తల నిమురుతున్నట్టు
పండ్లనిచ్చే కొమ్మలు నా పేగుల ఆర్తనాదాలు విని ప్రేమతో భోజనం పెడుతున్నట్టు
ఒక దృశ్యం నా కళ్ళముందు దృగ్గోచరమౌతుంది..
ఈర్ష్యతో ఇదంతా తొంగిచూస్తున్న సూర్యున్ని
గాలి సహాయంతో కసురుకుంటూ
పూలవానను నా మీదకు పురమాయిస్తుంది..
పచ్చని కళను ప్రతిఫలింపజేసిన
చెట్టుతల్లికి పాదాభివందనం
ఆత్మీయతా వల విసిరి
అనుక్షణం మనిషిని కాపాడుతున్న
అడవితల్లికి వందనం

చెట్టు నా బాల్యాన్ని గుర్తుచేస్తుంది
చిరుజల్లులు పడుతున్నప్పుడు
అమ్మ చీరకొంగై అడ్డుకున్నట్టు
ఆకులు ఆనందంగా అలా
ఊగుతుండడం చూస్తుంటే
ఇప్పటికిప్పుడు
తల్లి కనుసన్నల్లో ఆడుకుంటున్న
పిల్లాడినైపోతున్నా నేను..
ఆకు చాటున దాగిన ఆ పిందెలను చూస్తుంటే 
అమ్మ ఒడిలో ఒదిగిపోయిన మధుర జ్ఞాపకాలు
మదిలో మెదులుతున్నాయి

ఔషదాలకు నిలయమైన చెట్టు
ఆసుపత్రిలా కనిపిస్తుంది
ఆయువును పెంచే పెన్నిదిలా ఆశీర్వదిస్తుంది
త్యాగాలకు తన దేహాన్ని చిరునామగా చూపించి
ప్రకృతి ప్రసాదించిన పచ్చల పతకమై నిలుస్తుంది
మనిషి జీవనయానంలో ఓర్పు సంతకం చేసి తీర్పునిస్తుంది

చెట్టంటే.. నాలుగు కొమ్మలు
నలభై కాయలు కాదు
ఒక వసంతానికి నిలువెత్తు సాక్ష్యం!
నాల్గు తరాలను నడిపించే చైతన్యం!!
పరుల మేలు కోసమే పుడమిపై జన్మనెత్తిన మహోన్నతమైన అవతారం!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


జీవన రుతువు

జీవన రుతువు

డా।। ఎన్‌.గోపి