సాహితీ కోనలో కలుస్తుంటాడు
వచ్చిన ప్రతిసారీ...
కవితల తినుబండారాలను తెస్తుంటాడు
ఇద్దరం చెరోవైపు కూర్చుని...
కాల ప్రవాహాం లోకి
మాటల గులకరాళ్ళను విసరడం బాగుంటుంది
చీదరలతో తడిసిన
దేహాన్ని... ఒడ్డున ఆరేసుకుని
సాహిత్యాకాశంలో...
కవన తారలను చూడటం తనకిష్టం
పాలపుంతనెలా చేరుకోవాలో
వాకబు చేస్తూ...
మెరుపుల్ని గీస్తుంటాడు
అప్పుడప్పుడు
ఉరుముల్ని విసురుతాడు
దొంగచాటుగా సంధించిన
వ్యంగ్య బాణాలను
కవనాలుగా మలుచుకున్న
తన అంబులపొదిని చూపుతాడు
కోపమొస్తే
హాని చేయడు కానీ..
కవితాస్త్రాలతో సుతిమెత్తగా
దాడి చేస్తాడు
ఏ పదం తప్పిపోయినా
గేయమై గుబులు చెందుతూ..
కవన పాదాల పంచనే నిలబడి నిరీక్షిస్తాడు
ప్రతీకల నెక్కడ పారేసుకుంటాడో
పదేపదే వెతుక్కుంటూ..
ఏ పదబంధమో పిలిచినట్టు..
చెప్పకనే వెళ్లిపోతాడు
ఏంటో ఈ పిలగాడు
ఉత్త... కవితా పిచ్చోడు