నా ఆనందాశ్రువుల సాక్షిగా!

  • 72 Views
  • 2Likes

    డా।। దండెబోయిన పార్వతీదేవి

  • కర్నూలు.
  • 9440834017

అద్దంలో చందమామను చూపించి
అమాంతం ఆకాశాన్నే నాకందించిన మా అమ్మలా
పలకా బలపం పట్టించి, నా పసితనానికి ఆనందాన్ని దిద్దించిన
నా గురువుల పరమవాత్సల్యం నాకింకా గురుతే.
ఎండలో పాత భూతద్దం పెట్టి;
ఏ రకంగా కాగితం మండుతుందో
సునాయాసంగా శాస్త్రాన్ని విప్పిచెప్పి
మా పసిమెదళ్లలోకి కిరణాలను చొప్పించిన
నా గురువుల తెరవులెన్నెన్నో; నాకింకా గురుతే.
నాన్న తన పాదాలమీద నన్ను నడిపించినట్లు
ఇన్నిన్ని అక్షరాలను ఒత్తుల్ని కూర్చి కూర్చి
గుండెలూది పలికించిన; మా కళ్లలోకి ప్రసరించిన
నా గురువుల పరమసహనం నాకెప్పటికీ గురుతే.
చిత్రంగా నా భుజంమీద చేతులేసి
నా భవిష్యత్తుకు బలమైన వూతమేసి
పల్లెనుంచి ప్రపంచానికి; ఇరుకు నుంచి విస్తారానికి
నేస్తాలై నడిపించిన నా గురువులెందరో! నాకింకా గురుతే.
ఆదర్శాలను మూలసూత్రాలుగా చేసి
ప్రపంచాన్ని ప్రయోగశాలగా మలచి
బతుకును త్యాగింపనేర్పిన; జాతిని ప్రేమింపదిద్దిన
పరమయోగిగణాలు నా గురువులెందరో; చిరంతనులే.
క్షణాల్లో గాలిలోకి తెల్లపావురాలను ఎగరేసి
కనికట్టు చేసే పరమ మాంత్రికుడిలా
శతఘ్నిలా నన్ను దిద్ది; శరవేగంతోదూకించిన
నా మేలిమి గురువుల అహరహ ప్రోత్సాహం నాకింకా గుర్తే.
వెనుకటికి ఏమిటన్నది లేక;
రాబడి పోబడి లెక్కల ఆలోచనే యెరుగక
విజ్ఞాన రాజ్యానికి నన్నే రాజును చేయాలని
వెలుగును ముందుకు తోస్తూ వేదాంతిలా వెనక నిలుచున్న
పరమదైవతములు నా గురువులు, నా ప్రతి ఆనందంలో గురుతే; 
వారి (పదాలే) పాదాలే శరణ్యమని నాకిప్పటికీ ఎప్పటికీ ఎరుకే.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి

మట్టి

వి.సూర్యారావు


తాత

తాత

- బాలసాని కొమురయ్యగౌడ్‌


ఊహల వాన...

ఊహల వాన...

జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి


కడతేరి పోతివా

కడతేరి పోతివా

చిన్నం అశోక్


వ్యథార్థము

వ్యథార్థము

- వల్లూరు దాలినాయుడు,