అక్షర శ్రీవాణి! కళ్యాణ కల్పవల్లి!

  • 55 Views
  • 0Likes

    కళ్యాణశ్రీ (జంధ్యాల వేంకటరామశాస్త్రి)

  • పాలకొల్లు
  • 9640321630

శ్రీమ‘దోంకార’ రూపిణి! శ్రీవిరించి
దివ్యరసనాగ్ర వాసిని! భవ్యవేద
శాస్త్ర విద్యాస్వరూపిణి! జ్ఞానదాత్రి!
‘‘విశ్వ కళ్యాణవాణి’’కి - విరులజోత!!

‘మాఘశుద్ధ పంచమి’ - శుభ మంగళకర
పర్వమున ప్రభవించిన - పంకజభవు
రాణి- సత్య సుందర శివరమ్యగాత్రి-
‘‘స్వర్ణహంసవాహిని’’కి - శ్రీచందనమ్ము!!

అక్షర పరమేశ్వరి! శ్రీకరాభయాక్ష
దామ- పుస్తక-వీణ -పద్మ శుభపాణి!
ధవళ వస్త్రధారిణి! శారదాంబ! దివ్య
సత్యలోక విహారిణీ! శరణు! శరణు!

‘ఆర్ష మునీంద్రుల’ - హృదయాల వేదపు-
    రాణ సుధలనింపు -రమ్యవాణి!
‘వాల్మీకి’లో దివ్య భవ్యరామాయణ-
    గంగ పొంగించిన - కమ్రవాణి!
‘వ్యాసమహర్షి’చే - ‘‘బాసర’’లో కొలు
    వైన - ‘సరస్వతి’ - జ్ఞానవాణి!
కాళిదాస -తులసి - కంబ- నన్నయ - పోత
    నన్నమయ్యల భక్తి - అమృతవాణి!
భవ్య ‘‘కాశ్మీర’’ - ‘‘శృంగేరి’’ - దివ్యపీఠ
ముల - సువర్ణకాంతు లెసగ - కొలువు తీరి
నట్టి - ‘‘అక్షర శ్రీవాణి’’! అఖిల లోక
వందిత చరణీ! కళ్యాణి! వందనమ్ము!!

పలక- బలపము; పుస్తక కలములుంచి-
‘‘ఓం సరస్వతీ దేవ్యైనమః’’ - సభక్తి
కముగ పూజించు - బాలల కరుణ తోడ
జ్ఞాన ధనులుగ తీర్చుమో - ‘‘శారదాంబ’’!!

జ్ఞాన విద్యాకళాశ్రీ లొసంగి మమ్ము-
కరుణ పాలించు- ‘‘కళ్యాణ కల్పవల్లి’’!!
‘‘వేద కళ్యాణి! వాణి!’’ దీవించుమమ్మ!
‘‘పసిడి పలుకులమ్మా’’! నీకు ప్రణతులమ్మ!!!
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి

మట్టి

వి.సూర్యారావు


తాత

తాత

- బాలసాని కొమురయ్యగౌడ్‌


ఊహల వాన...

ఊహల వాన...

జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి


కడతేరి పోతివా

కడతేరి పోతివా

చిన్నం అశోక్


వ్యథార్థము

వ్యథార్థము

- వల్లూరు దాలినాయుడు,