గుర్తుండే తీరాలి!
అంతరంగపు లోయల్లో తొణికిసలాడి
నడుస్తున్న కాలం మీద
పాదముద్రలు వాలి
మథన పడ్డ క్షణాలు మౌన సంవేదనలూ
గుర్తున్నాయో లేదో
ఇక్కడ వేలాడే నిట్టూర్పులు
వలస జీవితాల గుసగుసలు
గుప్పుమంటున్నాయి.
నివసిద్దామంటే మట్టిపొరల
కలుషిత నీటి నరాల
ఉద్దానం లాంటి వెతలు తడబడుతూ
చీల్చలేని చీకటిలో చివికి
పోతున్నాయి.
ఎవరొస్తారో!
మార్పు సూర్యుల్ని
ఉదయింపజేస్తారో
అకుంఠిత దీక్షా సమరంతో
నిబ్బరాన్ని చేయూతగా
అందిస్తారో అని
గుండె గూటిలో బందీఖానాలా
శల్య జీవితాలు బిక్కుబిక్కు
మంటున్నాయి.
నీటి చెలమను ఎత్తుకోడానికి
ఎన్నేళ్లు చూడాలి.
పునర్లిఖించుకోవడానికి
అక్షరాలే మిగిలాయి.
కలిసిరాని
పొలం ఊసులు వింటే
శిఖరాగ్రపు గుండైన
ఉద్విగ్న క్షణాల్లో
ఊగిపోవాల్సిందే!
ఒక విముక్తి బావుటా ఎగరేసి
ఈ రాజ్యంలో
అస్వస్థ వ్యవస్థ నుంచీ
నిష్క్రమించడానికి
గళాలు విశృంఖలాల్ని ఛేదించాలి.
కర్తవ్యపు అంచుల్లో
శిరస్సుని ఎత్తటం
ఇప్పటి స్వరాలకి అవసరం.
ఎడారుల్ని నెత్తిన పిండేసుకుని
ఎన్నాళ్లీ ఉత్తరాంధ్ర నీటి ఘోష
డప్పుల గణగణల్ని వినిపించాలి.
అస్తిత్వపు పోరుబాటలో
ఉద్యమ లిఖిత చరిత్రల్ని
సృష్టించాలి!