మట్టికుండల సల్లవడ్డ మంచినీళ్ల లెక్క
ఎంత సల్లగుంటదో నా మావ సూపు...
ఎండకాలంల సాయంత్రంపూట పూసిన...
పందిరికింద మల్లెపూల లెక్క ఎంత తెల్లగుంటదో నా మావ మనసు...
పొద్దు పొద్దుగాల్నె ఊరిచెర్ల నిండుగబూసిన...
తామరపూలోలె కళ్లల్ల నిండిపోతడు
నా మావ...
మిట్టమధ్యానం పల్లె పొలిమేర్ల పంటచేలమీంచి ఇసిరే...
సల్లగాలి లెక్క ఎంతహాయిగుంటయో నా మావ ముచ్చట్లు...
రాతిరేల పున్నమి నాటి సెందురునోలే...
ఎన్నెల కురుపిస్తాంటయ్ సక్కని
నా మావ నవ్వులు...
ఎన్నెట్ల పూసిన సుక్కలన్నీ ఏరుకొచ్చి...
పున్నమి సీరకు అతుకవెట్టినట్టుంటది నా మావ అందం...
నీ మావ ఎట్లుంటడని అడిగితే
కళ్లల్ల నిండి...
ఒల్లంత పొగరై నేనేసే
ప్రతి అడుగు సూపుతది
ఇగో నా మావ ఇట్లుంటడని...