హేమంత ఋతుకాంతి

  • 1768 Views
  • 0Likes

    - నరసింహశర్మ మంత్రాల,

  • సికిందరాబాదు. sandhya_ragam@yahoo.com

మృదు సౌరభ, వర్ణ సుశోభిత ఫలప్రద
ఋతు హేమంత తూహిన శీరములు
భాస్వంత భాను సుసాంగత్య సాకార
దీవెనా రసఫల ఫసలీడెను నా చుట్టు
గుడిసెల వలపు వలయాకృతి పెనవేయ
గుల్మనీ, లతాప్రతాన నికుంజరములకున్‌.
ఆ నీరద, నీరాకుటీర తరూ శాఖాంతచేరుల
మ్రగ్గినా ఫలభార సంపదలు నమ్రమై వాలారు.
వూరి, ఉబ్బిన లేత సొరకాయలొక వంక
రసభరిత ముంత మామిళ్లు మరొక వంక
వగరు తొలగిన చిఱుతీపి చాఱపప్పుల్ల డొప్పల్లు
విరగ కాయించి ఇవి చాలవన్నట్లుగా, పూదఱి
పూడుల పూదేనియల్‌ నింపె పుష్పలీహములకై.
నులివెచ్చనీ ఋతు పగళ్లు నింగివడువన్న రీతి
నీటి ఆవిరి వూటులు నింపె హేమంత ఋతుకాంతి.
మితిలేని సొబగులా మిహిత మోహన కాంతి
తరచు వీక్షించ రుచి లేని వారెవ్వరీ ధరిత్రిన్‌?
సువిశాల తావులన్‌ దృష్టి శోధించు వారికిన్‌
నిర్లక్ష్య నీరెండవాలు కిరణాల మిలమిలలు
చేయు కనువిందు ధాన్యగాదెల గచ్చుటద్దాలపై.
గాలివే తలవెడలు చిరుగాలి తరగల్లు చెలిమితో
చెరిపేను సొబగు కురువేరు విభవంబు
తరువాయి కోతలకు కొడవళ్లు తాకిస్తే, బిగికట్టు
బిగిని పూల పూదేనియల ఘాటు నీటి ఆవిరి
పొగల మత్తుపొత్తుల కూడి మగత నిద్దురపోయే
ఆ నాగంటి నెఱియపై తనుపుగా తఱకల్లు.
ఓరిమి నేరము కాదు నా ఇక్షువూటుల
రసదాళికా పరంజము చెంత పడిగాపులున్‌.
ఏవీ ఆ వసంత గీతములన్నీ? ఓయి! ఏవీ?
మెత్తగిలు సాయంసంధ్యా సాంద్ర మేఘఛాయా తఱి
గీతములు కాదు, చురుకు స్వర గమకముల నెంచుమీ!
పలాల ధూమ్ర, ధూసర వర్ణ విరాజిత వినీలమందు
తేలగిలు నదీసర్జల చెంగలి చలాచల ఝిల్లికా శోచనములు
మలయ మారుత గతుల శృతులు కలిపే.
వలాహక వాక తటములమేయు బలిత రోమశ కూసులు.
కంచె-పొదల వెంబడి చిమ్మెటల సందడి పాటలు
పెరటి తోటల తిరుగాడు వాననెచ్చెలి శ్రావ్యగాన
పారవశ్యము సాగె శబ్ద మాధుర్య తిశ్రగతులన్‌.
పిండుగట్టుల చటక కిచకిచా రవములు నిండె
ఆ హేమంత ఋతుకాంతులీను గగనతలమంతన్‌.
(ప్రసిద్ధ ఆంగ్ల కవి జాన్‌కీట్స్‌ దాదాపు 180 ఏళ్ల కిందట రాసిన ‘ode on autumn' కవితా సుమానికి స్వతంత్ర అనువాదం.)

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


చెట్టు

చెట్టు

సాంధ్య‌శ్రీ‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


బుట్టదాఖలు

బుట్టదాఖలు

కళ్యాణదుర్గం స్వర్ణలత