పాదముద్రలు

  • 76 Views
  • 0Likes

    చొక్కర తాతారావు

  • విశాఖపట్టణం
  • 6301192215
చొక్కర తాతారావు

అడుగులు రెండే వెంటాడే దేహాలు అనంతం
నడిచి నడిచి సొమ్మసిల్లి తేరుకొని
రాళ్ల పునాదుల్లో
పగిలిన అరికాళ్ల మడమల పగుళ్లలో
రెండుగా చీలిన ఎర్రటి నెత్తుటి ముద్దల మధ్య
మనిషి ఉనికి ఇంకా ప్రశ్నార్థకమే
అణువణువు కలియతిరిగిన ఆ పాదాలు 
అడవంతా జల్లెడపట్టి
నేల నాలుగు చెరగులా మనిషి ప్రస్థానం
చీకటి గుహల ఆవాసాల మధ్య
జంతు కళేబరాల కోసం
రాతియుగం నాటి ఆయుధాల మీద నడిచి నడిచి 
దారుల నిండా రక్తం ఓడుతూ మనిషి ప్రయాణం
నిన్నటి నీడల్లో జాడలు వెతుక్కుంటూ
రేపటి అడుగుల్లో అడుగులు కలుపుతూ
దిగంతాల అవతల మనిషి పరిణామ క్రమం
రాలిపోయిన జ్ఞాపకాలను తవ్వుకుంటూ
ఆ అడుగులు అవిశ్రాంతంగా నడుస్తూనే ఉన్నాయి
తీరాన్ని తాకే అలల్లా ఇసుకలో కూరుకుపోతూ
అక్కడక్కడ పైకి తేలిన నిజాల్లా
ఆ పాదముద్రలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి
వేల ఏళ్లనాటి ఆనవాళ్లకు ప్రతీకగా
ఆ అడుగులు నేల మీద ఇంకా సజీవంగా ఉన్నాయి
నేలలో గూడుకట్టుకున్న సాక్ష్యాలేవో
బయటికి కనబడకుండా నిగూఢంగా
కాలాన్ని నేలమాళిగల్లో దాచేసి
శూన్యపు హస్తాలతో ఆకాశాన్ని నేలకు వంచి
అనంత హరిత శిఖరాలు తనలో దాచుకుని
పైకి పైపైకి ఆ అడుగులు 
కదులుతూనే ఉన్నాయి
అడవులు కొండలు దాటుకుంటూ
నది ఒడ్డున ప్రాణాలు సేదదీరినప్పుడు
నాగరికత కొత్తపుంతలు తొక్కింది
పచ్చటి వెలుగుకోసం నల్లని చీకటి పొరలు తొలగించుకుని
నిద్రాణమైన వ్యవస్థ ముఖద్వారం లోంచి
ఆ అడుగులు సాగుతూనే ఉన్నాయి
దారి పొడుగునా చరిత్ర తనలో దాచుకుని
ఆ పాదముద్రలు ఇంకా మన కళ్ల ముందు సజీవంగా
మిగిలి ఉన్నాయి
తూరుపు కొండ మీద పడమటి దారిలో
అవే పాదముద్రలు ఈనేల మీద 
మనిషి ఆచూకీ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మట్టి

మట్టి

వి.సూర్యారావు


తాత

తాత

- బాలసాని కొమురయ్యగౌడ్‌


ఊహల వాన...

ఊహల వాన...

జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి


కడతేరి పోతివా

కడతేరి పోతివా

చిన్నం అశోక్


వ్యథార్థము

వ్యథార్థము

- వల్లూరు దాలినాయుడు,