ఆ బాల్యం... నాకిప్పుడు కావాలి

  • 1160 Views
  • 0Likes

    కె.ఆర్‌.లలిత కుమారి

  • విస్సన్నపేట, కృష్ణా జిల్లా
  • 9949435729

తుమ్మెద రెక్కల రంగుల్ని బుగ్గల నిండా పులుముకొని
గుమ్మడిపూల అందాల్ని కన్నుల్లో నింపుకొని
అమ్మకొంగున దోబూచులాడే
కమ్మనైన.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..!
గున్న మావికొమ్మ ఉయ్యాల
చిన్న మనసుల చిలిపికయ్యాల
పున్నాగపూల పోటీల
పున్నమి వెన్నెల పూచిన తంగేళ్ల
తుళ్లింతల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..!
పెళ్లీ పేరంటం.. పండగ పబ్బాల్లో
బంతీ చేమంతి పూలజడ వూపుల్లో
పరికిణీ పట్టుకొని పరుగులుపెట్టే
పరదాలు, పగ్గాలు దరిచేరని
సరదాల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..!
కళ్లాపి చల్లిన పచ్చని వాకిట
రంగుల రంగవల్లుల నడుమ
కొలువైన గొబ్బెమ్మల చుట్టూరా చేరి
కోరికలు తీర్చమని కోలాటమాడే
కేరింతల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..!
పాడిపంటలు, పిండివంటలు..
భోగిమంటలు, కొత్తజంటలు..
హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలు
జానపదాల జీవనరాగాల..
గారాల.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..!
అరచేత పండిన గోరింటాకు
అందమైన మొగుడొస్తాడని
ఆటపట్టించే నేస్తాల అల్లరికి
సిగ్గుల మొగ్గై ముడుచుకుపోయే
ముచ్చటైన.. ఆ బాల్యం కావాలి నాకిప్పుడు..!!!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చినుకులు

చినుకులు

బి.గోవర్ధనరావు


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


మనస్సులం!

మనస్సులం!

ఎ.కిశోర్‌బాబు


య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

య‌మున‌, ముర‌ళీ, రాధ‌...

చేబ్రోలు అరుణ


నాలో

నాలో

వినోద్‌ గోరంట్ల


స్వాగతం

స్వాగతం

ఉల్చాల హరిప్రసాద్‌రెడ్డి