నా గురించి కూడా

  • 277 Views
  • 0Likes

    చిత్తలూరి సత్యనారాయణ

  • విజయవాడ
  • 9912346673

ఒరేయ్‌! నా గురించి కూడా
కొంచెం ఆలోచించండ్రా
నన్నో ఘనమైన పండుగను చేసి
ఊరేగించండ్రా
గ్రీటింగ్‌ కార్డులకు
రెక్కలు మొలిపించండి
అర్ధరాత్రుల దాకా
నన్నాహ్వానిస్తూ హాయిగా
నృత్యాలు చేయండి
బైకుల మీద ఊరేగుతూ
నింగీ నేలా దద్దరిల్లేలా
అరవండి
ఒరేయ్‌! నా గురించి కూడా
కొంచెం ఆలోచించండ్రా
మనదైన దాన్ని
పక్కన పడేసి
మనది కానిదేదో
నెత్తిన పెట్టుకుని ఊరేగే
పొరుగింటి పుల్లకూరను
విసిరేయండర్రా
నన్నో ఘనమైన పండుగను చేసి
ఊరేగించండ్రా
నేను మీకేం తక్కువ చేశానని...
మామిడి పూతనిచ్చాను
తీయని కాయలిచ్చాను
పచ్చదనపు ఛత్రాన్ని పట్టి 
కోయిలమ్మ పాటనిచ్చాను
మండే ఎండలకు గొంతెండుకు
పోతున్నప్పుడు
తాటిముంజ నీటినిచ్చాను...
రాబడులూ, వ్యయాలూ
రాజపూజ్యాలూ, అవమానాలూ
ముందే జాగ్రత్తపడమని
హెచ్చరించాను
తీపి, చేదు, వగరు, పులుపు
సమస్త రుచుల్ని చవిచూపిస్తూ
జీవితాన్ని ఒక పాఠంగా
నేర్పుతున్నాను
జీవన మూలాల్ని ప్రతియేటా
సరిచూసుకోమంటున్నాను
నేనేం తక్కువ చేశానని
ఒరేయ్‌! నా గురించి కూడా
కొంచెం ఆలోచించండ్రా
అప్పుడప్పుడూ
కవి సమ్మేళనాల్లో
గాయపడిన కవి గుండెలతో
నేను, నేనుగ లేనే లేనని
పండుగ జరుపుకునే
పరిస్థితేదని
నన్ను నిలదీస్తూ ఉంటారు కానీ
నా గురించి ఆలోచించడం
మానేశాక...
మీ మనసులు కూడా
కలుషితమవడం మొదలయ్యాక
ప్రకృతి మాత్రం కలుషితమవదా
ఒరేయ్‌! 
నన్నూ ఘనమైన పండుగను చేసి
ఊరేగించండ్రా
నేను మీ అమ్మనురా...
నేను మీ నాన్ననురా
మీ మూలాన్నిరా
మీ తెలుగు వెలుగునిరా
నన్ను మరిస్తే
మిమ్మల్ని మీరు మరిచినట్టే
మీ జాతిని మీరు విడిచినట్లే
ఒరేయ్‌! నా గురించి కూడా
కొంచెం ఆలోచించండ్రా
నన్నూ ఓ ఘనమైన
పండుగను చేసి
ఊరూ వాడా
ఊరేగించండ్రా...!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌