ఎవడురా... వాడెవడురా
ప్రణవ వీణలు మీటినోడు
ఎవడు ఎవడాడెవడురా
గుండె తీగలు తెంపినోడు
ఎండమావుల రాలిపడిన
చినుకు పండు వెన్నెలా
గండుకోయిల గానమధురిమ
పానవట్టమేగా ఇల
ఎచట నుంచి రాకమనదీ
వెళ్లునది మన మెచటికో
కల్లగాదిది ఎల్లజగతికి
ఉల్లమున ఉదయించు ప్రశ్న
ప్రాణి జీవనయానమంతా
చావు పుటుకల సమరమేగా
ఉండగోరిన ఎంతకాలం
ఉండు పదిలంగుండునా?
కణం నుంచి మనలపెంచి
కనికరమె లేకుండ తుంచి
ఆడుకొనుటకు జీవకోటితో
హక్కు ఇచ్చినదెవడురా
దిక్కులను వెలిగించునాత్మ
దీపమారిన చందమేనా!
అంధకారమె లోకమంతా
అల్ల నా చైతన్యమెంత
పంచభూతాలేకమైతే
ప్రాణికాకృతి కలిగెరా
ప్రకృతి పొత్తిళ్లలో అది
ప్రపంచమ్మై వెలిగెరా
కంచె చేను మేసినా
చందాన పంచన మిగిలెనా
సత్తు చిత్తుల విశ్వతత్వం
నిఖిలమై తా నిండి ఉన్నది