మహాకావ్యం

  • 382 Views
  • 2Likes

    సాంబమూర్తి లండ

  • ఉపాధ్యాయులు
  • ఒంకులూరు, శ్రీకాకుళం
  • 9642732008

దారిపొడుగునా అక్షరాల్ని
విత్తుకుంటూ పోతున్నాను
గడపకీ గడపకీ మధ్య
గుండెకీ గుండెకీ మధ్య
ఖాళీ కనపడిన చోటల్లా
అక్షరాల్ని నాటుతున్నాను
ప్రతి మనసు తలుపునూ తట్టి
గుండె గుమ్మంలో పడేలా
కొన్ని అక్షరాల్ని విసిరేసి
నవ్వుతూ నిష్క్రమిస్తున్నాను
అక్షరాల గుర్రాన్నెక్కి
అరణ్యాల్ని దాటుతున్నాను
అక్షరాలకు రెక్కలతికించి
సముద్రాల్ని అధిరోహిస్తున్నాను
అక్షరాల తాళ్లను విసిరి
పర్వత శిఖరాల్ని ముద్దాడుతున్నాను
మనసు మూలల్లోకి అక్షరాల్ని పంపించి
లోకం చూడని లోతుల్ని ఆవిష్కరిస్తున్నాను
మతాలు కులాలు దాటి ప్రవహిస్తున్నాను
నేలంతా గాలిలా విస్తరిస్తున్నాను
వేల మైళ్ళ వేగంతో ఒక కాంతి కిరణాన్నై
భూగోళాన్ని చిటికెలో చుట్టేస్తున్నాను
శూన్యాన్నై విశ్వమంతా వ్యాపిస్తున్నాను
ఎన్ని సార్లు నరకబడ్డా
మళ్లీ మళ్లీ పునరుజ్జీవనం
పొందే అరటిపాదులా
ఎంతలా తొక్కిపెడితే
అంత విసురుతో పైకి లేస్తున్నాను
కెరటాల్ని మించిన స్పూర్తితో
ఉరకలెత్తుతున్నాను
భూమధ్యరేఖ మీద నిలబడి
ఉత్తర దక్షిణ ధృవాల్ని అక్షరాలతో
పెనవేస్తున్నాను
కత్తులూ కుయుక్తులూ విఫలమైన చోట
కొన్ని అక్షరాల్ని చల్లి
శాంతిపూలు పూయిస్తున్నాను
అక్షరాల పల్లకిలో నేనే రాజునై
నేనే బోయీనై విహరిస్తున్నాను
ఎల్లలులేని నా దారిలో
ఎండమావులపై అక్షరధారల్ని వర్షించి
జీవనోత్సాహం నింపుతున్నాను
లిపి పుట్టుక నుండీ ఇప్పటివరకూ
పుట్టిన ప్రతి అక్షరాన్నీ గుండెల్లో పొదువుకుని
మానవతా మహా కావ్యాన్ని రాస్తున్నాను
గుండెను తడిమే వాక్యాల్ని నిర్మించి
పుటలుగా పేరుస్తున్నాను
విశ్వమానవుడికి ప్రేమతో
నా మహా కావ్యాన్ని అంకితమివ్వనున్నాను
నాలుగు వాక్యాల్ని చల్లి
నాలో మానవతా దీపాల్ని వెలిగించిన
ప్రతి కవికీ వినమ్రతతో నమస్కరిస్తున్నాను!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్