స్వరం

  • 412 Views
  • 0Likes

    గంగిశెట్టి లక్ష్మీనారాయణ

  • కుప్పం, చిత్తూరు.
  • 9441809566

నిరంతరం మోగుతూండే ఫోను
ఇందరు నాకున్నారని, ఇందరికి నేను కావాలని
గర్వంగా నాకు వినిపించి, కలిపించే ఫోను
ప్రాముఖ్య రాగ ప్రస్తారాన్ని బహురీతుల పలికించే ఫోను
‘‘నా’’ చిరునామాకి ఘనధామంగా నిలుస్తున్న ఫోను
అన్ని చోట్లా నా గుర్తింపులకి అంకెల్ని అరువిచ్చే ఫోను
ప్రత్యూష వేళ గీతాసందేశాలను వినిపించే ఫోను
వేల మైళ్ల దూరాలను వేలెడు ఎడంలోకి తెచ్చే ఫోను
వేల వేల హృదయ శకలాలను ఒక్కటిగా అతికే ఫోను
దిగులుగా చెవికి వేలాడే ఎద కమలాన్ని విప్పార్చే ఫోను
ఒంటరి జీవితాలకి తోడూ వెలుతురూ అయిన ఫోను
గతాన్ని ఫొటోలతో బంధించి,
మనసుని ఆత్రేయ గీతాల్లోకి కుదించి
మనిషి తీర్చలేని ఎన్నో మానసిక అవసరాలను తీర్చే ఫోను
మూగబోయింది...
ఉలుకూ పలుకూ లేకుండా మూలపడింది...
బతుకు పాతబడిందనే దానికి సూచనగా
మనిషిని మూలబడ్డాననే మాటకు గుర్తుగా...
ఎన్నో వేల లక్షల మాటలు వినిపించిన ఫోను
ఆ ఒక్క మాటను చెప్పలేక మూగబోయింది....
.............................
మాటామంతీ లేని బతుకు
ఫేస్‌బుక్కులో తెరపేజీ లాటిది
ఫేసే ఉంటుంది, మనసూ మాటా కాదు
మాట అవసరం తీరిందంటే అర్థం,
మనిషి అవసరం తీరిందని కాదు...
బతుకు అవసరమే తీరిందని...
‘‘మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వరా? మాట్లాడాలని’’
ఉన్నట్లుండి ఫేస్‌బుక్‌లోనే వచ్చే ఓ మెసేజి
మళ్లీ గుండెకు కొత్త ఊపిరి అందిస్తుంది
బతుకును, మనుషుల మధ్యకు మారుస్తుంది..
అంతర్జాలంలోంచి మనిషిని అంతరంగ ప్రపంచంలోకి
స్వరం ఆసరాగా సున్నితంగా నడిపిస్తుంది...
మనిషికి వరం, ఓ స్వరం! మనదనిపించే స్వరం!!
ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించే స్వరం...
పరికరాలు మారితేనేం, పలకరింపుంటే చాలు
శేషించిన బతుకులకు అదే పదివేలు....

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్


మౌనంగా ఒక నీ కోసం

మౌనంగా ఒక నీ కోసం

గ‌విడి శ్రీనివాస్‌