ఒక మెత్తని పాటతో నేను

  • 357 Views
  • 0Likes

    పద్మావతి రాంభక్త

  • విశాఖపట్నం
  • 9966307777

ఒకసారి
వేకువఝాము విచ్చుకున్నపుడు
ఒక మెత్తని పాట
నెమలీకలా తాకింది
నేనా వానలో
అమాంతం తడిసిపోయాను
పాత దుఃఖాలను
చరణాలలో కరిగిస్తూ
నన్ను నేను బ్రతికించుకోవచ్చునని
అప్పుడే తెలుసుకున్నాను
ఆనక పనుల కుంపట్లో
కాగుతూ నేను 
గాలిపల్లకి మోసుకొచ్చిన
చల్లని గీతాన్ని తాగి
తేలికపడ్డాను
పాట ఊపిరిలో 
లోపలికంటా ఇంకి
నా మనసును
లోతుగా స్పృశించింది
అంతలోనే గీతం
పల్లవి అందెలతో
మళ్లీ ఘల్లున మోగింది
నరనరాలలోకి ప్రవహించే
ఆ స్వరాల నదిలోని గలగలలను
శ్రద్ధగా చెవినొగ్గి విన్నాను
మృదువైన పాట
అంతే మృదువుగా
అర్ధమవడం మొదలుపెట్టింది
ఒంటరి ఏకాంతంలోని ఖాళీలను
రాగాలతో పూరించుకుంటుంటే
అణువణువులో
తెలియని పరిమళమేదో పూసింది
ఎప్పటినుండో
ఒత్తిళ్లతో మసిబారిన మనసు చిమ్నీ
ఒక్కసారిగా తళతళా మెరిసింది
సెలయేటి అలలాంటి
సున్నితమైన పాట
చిన్న చేపపిల్లలా నన్నెత్తుకుని
సముద్రాన్ని చేసింది
ఉన్నట్టుండి నాలో
ఏవో అనుభూతి పుటలు
తిరగేయడం మొదలైంది
కనురెప్పలపై
రంగురంగుల క్షణాలు
పక్షుల్లా వాలాయి
నన్ను కదిలించిన
వెన్నెల దృశ్యాలేవో
తీగలుగా సాగి
స్వర్గతీరాలదాకా నడిపించాయి
పాట శిఖరాగ్రాన్ని తాకగానే
అణువై ముడుచుకున్న నేను
అనంత ఆకాశానయ్యాను
సీతాకోకలాంటి ఆ గీతం
మరింత అందంగా
పురి విప్పింది కొన్ని ఘడియలలా
నన్ను దోచుకోగానే
నేను అచ్చంగా
పాత నాలాగే అగుపించే
ప్రక్షాళన జరిగింది
అయినా పాట ఎవరికైనా
లాలించే అమ్మే తెలుసా
నేనైనా పాటైనా
అక్షరాల కొమ్మలకు మొగ్గతొడిగే
తోబుట్టువులమే కదా

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జయహూ జయహూ భారతధాత్రీ

జయహూ జయహూ భారతధాత్రీ

పులిగడ్డ శ్రీరామ చంద్రమూర్తి


నా కవిత్వమంటే...

నా కవిత్వమంటే...

బత్తిన కృష్ణ


మా ఇంట్లో గోదారి జాతర

మా ఇంట్లో గోదారి జాతర

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్


వర్ణచిత్రాలు

వర్ణచిత్రాలు

- కటుకోఝ్వల రమేష్‌


నన్ను పలికించిన మనసు

నన్ను పలికించిన మనసు

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి